బంజారాహిల్స్, నవంబర్ 16: జైల్లో ఉన్న తమ స్నేహితుల ములాఖత్ కోసం వచ్చిన ఇద్దరు వ్యక్తులు నేరానికి పాల్పడ్డారు. ఓ ఏటీఎంలో చోరీకి యత్నించారు. ఈ ఘటనలో ఒకరిని పోలీసులు పట్టుకోగా, మరొకరు పరారయ్యాడు. అతన్ని విచారించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. శ్రీనగర్ కాలనీలోని ఏటీఎం చౌరస్తాలో ఉన్న కోటక్ మహేంద్ర బ్యాంక్‌కు చెందిన ఏటీఎంలోకి శుక్రవారం రాత్రి 10.40గంటల ప్రాంతంలో ఇద్దరు దుండగులు ప్రవేశించారు.
ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేయడంతో పాటు డబ్బులు తీసుకునేందుకు యత్నిస్తున్న విషయాన్ని సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన బ్యాంక్ సెక్యూరిటీ విభాగం స్థానికంగా ఉన్న సంస్థ ప్రతినిధి ముఖేశ్‌కు సమాచారం అందించింది. దీంతో అక్కడకు చేరుకోగానే ఇద్దరు దుండగులు పారిపోయారు. ఈ మేరకు ముఖేశ్ అర్ధరాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వారిలో ఓ నిందితుడిని పట్టుకొని విచారించగా, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన పాత నేరస్తులు పరియేజ్ (32), అరివింద్ బోలా (30)గా గుర్తించారు. గంజాయి కేసుల పట్టుబడి చంచల్‌గూడ జైలులో ఉన్న వారి స్నేహితులు సలీం, సక్లెయిన్ను ములాఖత్‌లో కలిసేందుకు వచ్చి నగరంలోని ఏటీఎంలలో చోరీ చేసి యూపీకి పారిపోవాలని ప్రణాళిక వేసుకున్నట్లు వెల్లడైంది.