సిటీబ్యూరో, సెప్టెంబర్ 12(నమస్తే తెలంగాణ): నగరానికి చెందిన ఓ వ్యక్తిని మ్యాట్రిమొని సైట్లో చూసి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి రూ.25లక్షలు కొట్టేసిన ఇద్దరు వ్యక్తులను సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన ఓ వ్యక్తి వధువు కోసం చూస్తూ ఖుబ్సూరత్.రిష్తే ఇన్స్టాగ్రామ్ ఐడీతో ఉన్న పేజీలో ఒక మహిళను చూసి ఇష్టపడి అక్కడ ఇచ్చిన ఫోన్‌నెంబర్‌కు కాల్చేశాడు. దీంతో ఆ మహిళ బాధితుడిని సంప్రదించి అతనిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఆ తర్వాత తరుచూ వీడియోకాల్స్ చేస్తూ తనకు ఆరోగ్య సమస్యలు, అర్జెంట్ ఇంటి పని పేరుతో డబ్బులు వసూలు చేసింది.
బాధితుడు ఆమె మాటలు నమ్మి రూ.25లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత బాధితుడు ఎంక్వైరీ చేస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె డీపీగా అప్లోడ్ చేసిన ఫొటో పాకిస్తానీ నేషనల్, అండ్ యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్ అయిన పర్వషాషాదిగా గుర్తించాడు. దీంతో తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినా ఆమె ఇవ్వలేదు. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని బీజాపూర్‌కు చెందిన అనీస మహ్మదీయాసిన్, హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ అమీర్లను అరెస్ట్ చేశారు.
బిజాపూర్‌కు చెందిన జోహర్ఫాతిమా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనీస, ఫాతిమా ఇద్దరు ఈజీ మనీకోసం మ్యాట్రిమోనీ పేరుతో పలు ఇస్లామిక్ వాట్సాప్ గ్రూపుల్లో చేరి అందమైన అమ్మాయిల ఎడిటెడ్ ఫొటోస్, వీడియోస్ అప్లోడ్ చేసేవారని పోలీసులు తెలిపారు. వరుడి కోసం వెతుకుతున్నామని చెప్పడంతోపాటు ఖుత్సూరత్.రిషతె పేరుతో పేజీ ఓపెన్ చేసి అందులో పాకిస్తానీ నటుల ఫొటోలు అప్లోడ్ చేసేవారు. ఎవరైనా పెళ్లికి ఇంట్రెస్ట్ చూపిస్తే వారిని మాటల్లో పెట్టి వారి నుంచి డబ్బులు గుంజేవారని పోలీసులు పేర్కొన్నారు. నిందితుల నుంచి డెబిట్ కార్డులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.