Fake Certificates Gang | చార్మినార్, ఫిబ్రవరి 6 : విలాసవంతమైన జీవితాలకు అలవాటుపడ్డ పలువురు యువకులు నకిలీ విద్యార్హత పత్రాలను సృష్టిస్తూ అమాయకులను మోసాగిస్తున్నారని సౌత్ ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ స్వామి తెలిపారు. శాలిబండ ప్రాంత వాసి అబ్దుల్ ఖదిర్ (47) చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడని గురువారం డబీర్పురా పోలీస్ స్టేషన్లో డీసీపీ స్వామి మీడియాతో చెప్పారు. ప్రైవేట్ కంపెనీల్లో సంపాదిస్తున్న నెలవారీ వేతనంతో విలాసవంతమైన జీవితం గడపలేకున్నాడన్నారు. నగరంలో ఉద్యోగ రీత్యా, విదేశాలకు వెళ్లాలనుకునే నిరుద్యోగులకు నకిలీ విద్యార్హత పత్రాలను అంటగట్టి సులువుగా డబ్బులు సంపాదించాలని పథకం వేశాడు. ఇందుకోసం అతని స్నేహితుడైన మహమ్మద్ షకీల్ (37)కు తన ప్లాన్ వివరించి డబ్బులు సంపాదించడానికి సులువైన మార్గమని సూచించాడు.
కన్పూర్ నివాసి సంజయ్ శర్మ అలియాస్ సాహిల్ శర్మతో నిందితులు సంప్రదింపులు జరిపారు. హైదరాబాద్ నగరంలో నిందితులు అమాయకులను గుర్తిస్తూ వారికి దేశంలోని విశ్వవిద్యాలయాల ధ్రువీకరణ పత్రాలు అందిస్తామని చెప్పి, భాదితుల అవసరాల మేరకు నగదును డిమాండ్ చేసే వారు. బాధితుల నుండి నగదు తీసుకున్న నిందితులు సాహిల్ శర్మకు వివరాలు అందించేవారు. సాహిల్ శర్మ బాధితుల వివరాలతో నకిలీ విద్యార్హత పత్రాలను తయారు చేసి వాటిని అబ్దుల్ ఖదిర్కు కొరియర్లో పంపేవాడు. వాటిని నిందితులు అమాయకులకు అంటగట్టేవారు.
నిందితుల గురించి.. నకిలీ విద్యార్హత పత్రాల తయారీ గురించి విశ్వసనీయ సమాచారం అందుకున్న సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు డబీర్ పుర పోలీసులతో కలసి బుధవారం చంచల్గూడ న్యూ రోడ్లోని డైమండ్ హోటల్లో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై హైదరాబాద్లోని కంచన్ బాగ్, చంద్రయణ గుట్ట, హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని తెలిపారు.
నిందితుల వద్ద నుండి కాకతీయ విశ్వవిద్యాలయనికి చెందిన (43) నకిలీ సర్టిఫికెట్లు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఎనిమిది నకిలీ సర్టిఫికెట్లు, నేషనల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ & సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ కు చెందిన (10) నకిలీ సర్టిఫికెట్లు,న్యూఢిల్లీ, అన్నామలై విశ్వవిద్యాలయం నకిలీ సర్టిఫికెట్లతోపాటు ఓ ద్విచక్ర వాహనం, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని అదనపు డీసీపీ స్వామి తెలిపారు.నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో మలక్ పేట్ ఏసీపీ శ్యాంసుందర్తోపాటు ఇన్స్పెక్టర్ నాను నాయక్, ఎస్ఐ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.