మాదాపూర్, జూలై 30: జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా టీయూడబ్ల్యూజే పని చేస్తున్నదని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ అన్నారు. మియాపూర్‌లోని హోటల్ అశోక గ్రాండ్లో మంగళవారం యూనియన్ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నూతన రాష్ట్ర కమిటీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీడియా అకాడమీ ఆధ్వర్యంలో సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో విలేకరుల సమస్యలపై తరుచు సమావేశాలు, చర్చలు జరుపుతున్నారని పేర్కొన్నారు. సకాలంలో సరైన వైద్య సదుపాయాలు అందక పలువురు జర్నలిస్టులు ప్రాణాలను కోల్పోయారన్నారు. ప్రభుత్వం జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతనిస్తూ త్వరలోనే హెల్త్ కార్డులను అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అర్హులైన ప్రతి విలేకరికి అక్రిడిటేషన్ అందాల్సిన అవసరం ఉందన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికి మండల జిల్లా కేంద్రాలుగా పరిగణనలోకి తీసుకుంటూ ఇండ్ల స్థలాలను మంజూరు చేసే విధంగా యూనియన్ కృషి చేస్తుందని స్పష్టం చేశారు. అనంతరం, కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, జాతీయ కౌన్సిల్ మెంబర్ సలీంలు మాట్లాడారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీలో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చేల్ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులను శేరిలింగంపల్లి యూనియన్ జర్నలిస్టులు సత్కరించారు.
రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన విరాహత్ అలీ, కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డితో పాటు కోశాధికారి వెంకట్రెడ్డిలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు శ్రీకాంత్‌రెడ్డి, శంకర్ శిగా బాలరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కిషన్, సత్యనారాయణ, శేరి లింగంపలి ్లప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస రావు, నాగేందర్ రెడ్డి, జిల్లా జాయింట్ సెక్రటరీ శ్రీనివాసులు గౌడ్, కార్యవర్గ సభ్యులు దారుగుపల్లి సత్యనారాయణ, సీనియర్ జర్నలిస్టులు కొండా విజయ్ కుమార్ ఉన్నారు.