బంజారాహిల్స్, జూన్ 19: ఆవేశంలో కోడలు మీద కత్తితో దాడికి పాల్పడిన మామ.. వృద్ధుడైన తన తండ్రిని జైలుకు పంపించడం ఇష్టంలేక భార్యను బతిమాలి తనపై నెపం వేసుకున్న భర్త.. తండ్రే మద్యం మత్తులో గొడవపడి తల్లిమీద కత్తితో దాడి చేశారంటూ సాక్ష్యం చెప్పిన కొడుకులు.. పోలీసుల విచారణలో అసలు విషయం బయటకు రావడంతో కోడలిపై కత్తితో దాడిచేసిన మామతో పాటు సాక్ష్యాలను తారుమారు చేసిన కొడుకు కటకటాలపాలయ్యారు. సినీఫక్కీలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణానగర్ సీ బ్లాక్‌లో నివాసం ఉంటున్న సీహెచ్ అరుణ్‌ప్రసాద్(45)కు భార్య జయలక్ష్మి(42)తో పాటు ముగ్గురు కొడుకులున్నారు.
అతను ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా, భార్య జయలక్ష్మి గృహిణి. కాగా వారితోపాటు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న తండ్రి వెంకటేశ్వరరావు(68) కూడా నివాసం ఉంటున్నాడు. కాగా అరుణ్‌ప్రసాద్ తరచూ మద్యం సేవించి వచ్చి భార్యతో గొడవపడుతుంటాడు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం తనమీద భర్త కత్తితో దాడి చేశాడంటూ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలక్ష్మి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
విచారణలో ట్విస్ట్..
హత్యాయత్నం కేసు విచారణలో భాగంగా ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు అరుణ్‌ప్రసాద్ పాత్రపై ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. బాధితురాలి ఫిర్యాదులో మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో తన భర్త దాడి చేశాడని పేర్కొంది. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని తేలింది. దీంతో బుధవారం రాత్రి నిందితుడిని మరోసారి విచారించిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. భార్యను ఎందుకు చంపాల్సి వచ్చిందని, అనసరంగా జైలుకు వెళ్తున్నావంటూ అరుణ్ప్రసాద్ను ప్రశ్నించగా.. తన భార్యను తానెందుకు చంపుకుంటానంటూ కన్నీళ్లపర్యంతం అయ్యాడు.
స్వల్ప విషయాల్లో అప్పుడప్పుడూ తన తండ్రి వెంకటేశ్వరరావుకు, తన భార్య జయలక్ష్మికి గొడవలు జరుగుతుంటాయని, ఇదే క్రమంలో బుధవారం ఉదయం గొడవ జరగడంతో మాటామాటా పెరిగి తన తండ్రి వెంకటేశ్వరరావు ఆవేశంలో జయలక్ష్మి మీద కత్తితో దాడి చేశాడని, దాంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారని అంగీకరించాడు. ఘటన జరిగిన సమయంలో తాను ఇంట్లో లేనని, ఆస్పత్రికి వెళ్లిన తర్వాత దాడి ఘటన గురించి తెలిసిందని అరుణ్ ప్రసాద్ పేర్కొన్నాడు.
వృద్ధుడైన తన తండ్రి జైలుకు వెళ్లడం ఇష్టంలేక నేరాన్ని తనపై వేసుకుంటానని బతిమాలడంతో భార్య జయలక్ష్మితో పాటు పిల్లలు కూడా ఒప్పుకున్నారని వివరించాడు. దీంతో ఇంట్లోని రక్తపు మరకలను తొలగించి మధ్యాహ్నం తర్వాత ఫిర్యాదు చేశామని తెలిపాడు. దీంతో హత్యాయత్నం కేసులో మామ వెంకటేశ్వరరావును నిందితుడిగా చేర్చిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. సాక్ష్యాలను తారుమారు చేసిన అరుణ్‌ప్రసాద్ మీద సైతం కేసు నమోదు చేశారు.