వెంగళరావునగర్, ఏప్రిల్ 24 : ఏటీఎం యంత్రంలో సరికొత్త మోసం వెలుగుచూసింది. కస్టమర్లు డ్రా చేసే డబ్బు బయటకు రాకుండా ప్యానల్ యాక్సెస్ లో ఇరుక్కునేలా టేప్ అంటించి.. కస్టమర్లు బయటికి వెళ్లాక నకిలీ కీస్ తో యాక్సెస్ మిషన్ తెరిచి అందులోని డబ్బును దొంగ చోరీ చేసి ఉడాయించాడు. కస్టమర్లు ఏటీఎం నుంచి లావాదేవీలు ప్రాసెస్ జరిగినట్లు మెసేజులు వచ్చినప్పటికీ.. ఖాతాదారులకు ఏటీఎం నుంచి డబ్బు రాలేదు. ఈనెల 16న ఓ కస్టమర్ తనకు జరిగిన మోసంపై అంబుడ్స్మెన్ కు ఫిర్యాదు చేయడంతో బ్యాంక్ అధికారుల దృష్టికి వచ్చింది.
యూనియన్ బ్యాంక్ డిప్యూటీ బ్రాంచ్ హెడ్ బి.ప్రదీప్ దినకర్ రాజు ఎస్.ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏటీఎం సీసీ ఫుటేజ్ ను ఎస్.ఆర్.నగర్ పోలీసులు సేకరించి పరిశీలించగా..నగదు పంపిణీ స్లాట్ లో టేప్ అంటించి డబ్బు బయటకు రాకుండా అడ్డుకున్నట్లు వెల్లడైంది. మారుతాళం చెవులతో ఏటీఎం పానల్ యాక్సెస్ ను తెరిచి అక్కడ చిక్కుకుని ఇరుక్కుపోయిన డబ్బు కాజేసి మోసం చేసినట్లు తేలింది. ముందస్తు పథకంతో పదేపదే ఏటీఎంలోకి జొరబడి సుమారు రూ.45 వేలు అపహరించుకెళ్లినట్లు వెల్లడైంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.