డిస్కంలో మామూళ్ల పర్వం!
బిల్లులు కట్టకుండా ఉండాలంటే నెలవారీ మామూళ్లు.. కొత్త మీటర్లు కావాలంటే సిబ్బందికి డబ్బులు.. కొత్త విద్యుత్ కనెక్షన్ కావాలన్నా ఎంతో కొంత ముట్టజెప్తేనే పనులు. ఇదీ టీజీఎస్పీడీసీఎల్లోని అన్ని సర్కిళ్లలో అనధికారికంగా అమలవుతున్న పరిస్థితి. దక్షిణ డిస్కంలో కీలక సర్కిళ్లలో అంటే నగరశివారు మొదలుకొని మిగతా డిస్కంలో మామూళ్ల పర్వం! రూరల్ ప్రాంతాల్లోని ప్రతీ సెక్షన్లో డబ్బులు పెడితే తప్ప పనులు కాని వ్యవస్థ కొనసాగుతోంది. కార్పొరేట్ కార్యాలయంలో ప్రతీసారి జరిగే సమీక్షాసమావేశాల్లో వినియోగదారుడికి నష్టం జరగకుండా వ్యవహరించాలంటూ అధికారులు చెప్తున్నా క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారు. అధికారుల లంచగొండితనానికి నిదర్శనంగా గత పదినెలల్లో ఐదుగురు అధికారులు ఏసీబీకి చిక్కారు.
- ఏసీబీ కేసులు నమోదైనా మారని వైనం
- కొందరు అధికారుల తీరుపై ఆరోపణలు
- మీటర్ల నుంచి బిల్లుల వరకు ప్రతీ పనికి ఓ రేటు
- హెచ్‌టీ కనెక్షన్ల బిల్లులను ఏమార్చే పనులు
సిటీబ్యూరో, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): బిల్లులు కట్టకుండా ఉండాలంటే నెలవారీ మామూళ్లు.. కొత్త మీటర్లు కావాలంటే సిబ్బందికి డబ్బులు.. కొత్త విద్యుత్ కనెక్షన్ కావాలన్నా ఎంతో కొంత ముట్టజెప్తేనే పనులు. ఇదీ టీజీఎస్పీడీసీఎల్లోని అన్ని సర్కిళ్లలో అనధికారికంగా అమలవుతున్న పరిస్థితి. దక్షిణ డిస్కంలో కీలక సర్కిళ్లలో అంటే నగరశివారు మొదలుకొని మిగతా డిస్కంలో మామూళ్ల పర్వం!
రూరల్ ప్రాంతాల్లోని ప్రతీ సెక్షన్లో డబ్బులు పెడితే తప్ప పనులు కాని వ్యవస్థ కొనసాగుతోంది. కార్పొరేట్ కార్యాలయంలో ప్రతీసారి జరిగే సమీక్షాసమావేశాల్లో వినియోగదారుడికి నష్టం జరగకుండా వ్యవహరించాలంటూ అధికారులు చెప్తున్నా క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారు. అధికారుల లంచగొండితనానికి నిదర్శనంగా గత పదినెలల్లో ఐదుగురు అధికారులు ఏసీబీకి చిక్కారు.
ఈ కేసులు దక్షిణ డిస్కంలో అవినీతి నిరోధక చర్యల అమలుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మీటర్ వ్యవహారం నుంచి కొత్త విద్యుత్ కనెక్షన్, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, పెండింగ్ బిల్లులు పరిష్కారం, కొత్త మీటర్ల మంజూరు వరకు వివిధ పనుల్లో లంచాల ఆరోపణలు నమోదయ్యాయి. ఒకవైపు పారదర్శక పాలన, అవినీతి రహిత సేవలంటూ ప్రభుత్వం, డిస్కం ఉన్నతాధికారులు చెబుతున్నా ప్రజలు మాత్రం తమ పనుల కోసం ప్రతీ పనికోరేటు చొప్పున అదనంగా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది.
ఈ ఏడాది ఏసీబీ కేసులిలా..!
ఫిబ్రవరి 24న మాసబ్‌ట్యాంక్ ఆపరేషన్స్ సెక్షన్ అసిస్టెంట్ ఇంజినీర్ శ్రీనివాసరావు సీజ్ చేసిన విద్యుత్ మీటర్ వ్యవహారంలో చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రూ.16వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. మే 16న యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరులో అసిస్టెంట్ లైన్మెన్ పప్పుల రమేశ్ వ్యవసాయబోరుబావికి విద్యుత్ కనెక్షన్, స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడానికి రూ.35వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.
జూన్ 18న ఐడీఏ బొల్లారం పరిధిలో అడిషనల్ అసిస్టెంట్ ఇంజినీర్ రామకృష్ణారెడ్డి ఒక వాహనం ఢీకొని దెబ్బతిన్న విద్యుత్ స్తంభం విషయంలో చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రూ.25వేలు లంచం తీసుకున్నట్లు ఏసీబీ పేర్కొంది. నర్సాపూర్ డివిజన్ ఏడీఈ రమణారెడ్డి పెండింగ్ బిల్లుల వ్యవహారంలో రూ.25వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. అక్టోబర్ 15న మాదన్నపేట సెక్షన్ అసిస్టెంట్ ఇంజినీర్ సంధ్యారాకేశ్ ఆరు కొత్త విద్యుత్ మీటర్ల మంజూరు కోసం రూ.1.20లక్షలు డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ముడుపులు తప్పవు..
విద్యుత్ కనెక్షన్‌తో మొదలై కొత్త మీటర్ల ఏర్పాటు, బిల్లుల సమస్య పరిష్కరించుకోవాలంటే సామాన్యులు అధికారుల చుట్టూ తిరగాల్సిందే. తమ పనులకోసం సిబ్బంది అడిగినంత ఇచ్చుకుని పనులు పూర్తి చేసుకోవాలసిందే తప్ప రూల్ ప్రకారం పనులు కావాలంటే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందేనని వినియోగదారులు చెబుతున్నారు. ముఖ్యంగా నగరశివారులోని పలు సెక్షన్లలో పనులకోసం ఒక్కొక్క పనికి ఒక్కొక్క రేటు నిర్ణయించి కొందరు ఆర్టిసన్లు, లైన్మెన్లు, ఏఎల్ఎంల ద్వారా వసూళ్లు చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవల నగరశివారులోని ఓ సర్కిల్లో ముగ్గురు ఆర్టిసన్లను వేరే ప్రాంతానికి బదిలీ చేశారు.
వారి విషయంలో ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు కొంత మెతకతనం ప్రదర్శించారనే చర్చ జరుగుతోంది. కోర్టు ఆర్డర్లు డూప్లికేట్వి తయారుచేయడం మొదలు విద్యుత్ కనెక్షన్లు, స్తంభాలు, లైన్ల వరకు వారిదే హవాగా కొనసాగిన చోట వారిపై తీసుకున్న చర్యలు మాత్రం నామమాత్రమేనంటూ సర్కిల్లో మాట్లాడుకుంటున్నారు. వీరిలో ఒకరు చివరి నిముషం వరకు తనకు వచ్చిన ఆర్డర్‌ను కూడా పట్టించుకోకుండా తాను అదే చోట పనిచేస్తానంటూ మొరాయించడంతో అధికారులు కొంత సీరియస్ అయ్యారు.
చివరకు అతనుకూడా ఆ స్థానం నుంచి వెళ్లిపోయి వేరొకచోట జాయిన్ అయ్యారు. విద్యుత్ సంస్థ పరంగా కొత్త పద్దతి తీసుకొచ్చినా అప్లికేషన్ పెట్టి లోడును బట్టి డబ్బులు కడితే మొత్తం సంస్థనే అన్నీ చూసుకుంటుందని, ఎస్టిమేషన్లు తదితర వ్యవహారాల్లో ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేకుండా ఎక్కడా డబ్బులు ఖర్చు పెట్టనవసరం లేకుండా పారదర్శకంగా పనులు జరుగుతాయని సీఎండీ జితేష్ పాటిల్ చెప్పినా క్షేత్రస్థాయిలో మాత్రం పనుల విషయంలో ముడుపుల దందా కొనసాగుతూనే ఉంది.
అప్లికేషన్ విధానం మారినా.. అవి చేయాల్సిన అధికారులు, సిబ్బంది తమ పనుల్లో జాప్యం లేకుండా ఉండాలంటే కొంత ముట్టజెప్పాల్సిన పరిస్థితి మాత్రం మారడం లేదని, కాంట్రాక్టర్లకు పనులు అప్పగించినా మెటీరియల్ విషయంలో చేసే ఆలస్యంతో పనులు కూడా నెమ్మదిగా జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మీటర్ల .వ్యవహారంలో.
ముఖ్యంగా హెచ్టీలలో చాలా కనెక్షన్ల బిల్లులు పెద్ద ఎత్తున బకాయిలు ఉన్నా..వాటిని ఏమార్చడంలో డిస్కం సిబ్బందే సదరు యజమానులకు సలహాలిస్తూ తమ జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక సర్కిల్లో 24లక్షల రూపాయల బాకీ ఉంటే యజమాని రకరకాల ప్రయోగాలు చేసి చివరకు మీటర్ మార్చి కొత్త మీటర్‌కు వేరే పేరుతో దరఖాస్తు చేసుకుని తీసుకున్నారు.
పాత మీటరు బకాయి అలాగే ఉండిపోయింది. కొన్ని సర్కిళ్లలో హెచ్‌టీ కనెక్షన్లకు సంబంధించిన సంస్థలలో కొందరి దగ్గరికి నేరుగా సిబ్బంది వెళ్లి రేటు మాట్లాడుకుని ఇచ్చినంత పుచ్చుకుని బిల్లులు కట్టకున్నా నెలల తరబడి, కొన్నింటి విషయంలో సంవత్సరాల తరబడి ఆపేసిన సందర్భాలున్నాయి. ఈ విషయంలోనే ఇటీవల కొందరు అసిస్టెంట్ ఇంజినీర్లకు ఉన్నతాధికారులు మెమోలు జారీ చేశారు. కొన్ని సర్కిళ్లల్లో కరెంట్ మీటర్లు తగలబెట్టిన సంఘటనలు ఉన్నప్పటికీ వాటిని బయటకు రానీయకుండా సిబ్బందే మేనేజ్ చేస్తున్నారని, తద్వారా సంస్థకు ఆ బిల్లుకు సంబంధించిన నష్టం జరుగుతున్నట్లుగా అదే సర్కిల్‌కు చెందిన ఒక అధికారి చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

