మొయినాబాద్, మార్చి2 : సాంకేతిక రంగంలో నూతన ఆవిష్కరణలకు తెలంగాణ రాష్ట్రం కేంద్ర బిందువుగా మారిందని..నూతన ఆలోచనలకు టీఎస్ఐసీ ఎంతో ప్రోత్సహిస్తుందని టీఎస్ఐసీ రాష్ట్ర చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత తౌతం అన్నారు. మొయినాబాద్ మండల పరిధిలోని విద్యాజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి టెక్నో -కల్చర్ -స్పోర్ట్స్ ఫెస్ట్ రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. అందులో భాగంగా టెక్నికల్ అండ్ కల్చరల్ ఫెస్ట్ యూడీబీహెచ్ఏవీ -23, ఫినిక్స్ -23 స్పోర్ట్స్ ఫెస్ట్‌లు నిర్వహించారు. విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు నూతన ఓరవడి సృష్టించాలని చెప్పారు. వినూత్న ఆలోచనలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఎస్ఐసీ ఎంతో ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రాష్ర్టాన్ని ఐటీ హబ్‌గా తయారు చేస్తున్నారని, వారి చొరవతో అనేక ఐటీ కంపెనీలు ఆవిష్కరించబడ్డాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్చార్జి డెరెక్టర్ ప్రొఫెసర్ రాజేశ్‌కుమార్, వీజేఐటీ డైరెక్టర్ డాక్టర్ సాయిబాబారెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మజ, ప్రోగ్రామ్ కన్వీనర్ బి శ్రీనివాస్, కో -కన్వీనర్ డాక్టర్ ఓబులేశ్, డాక్టర్ జె రమేశ్‌బాబు, వెంకటచలం, జి. శ్రీలత పాల్గొన్నారు.