సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): అపార్ట్మెంట్లలో డోర్ టూ డోర్ తిరగకుండా ఒక చోట డస్ట్ బిన్లను ఏర్పాటు చేస్తే చెత్త సేకరణ సులభతరం అవుతుందని, అపార్ట్మెంట్ అసోసియేషన్ వారిని సంప్రదించి బిన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఉదయం కమిషనర్ ఆమ్రపాలి, జోనల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అపార్ట్మెంట్లలో చెత్త సేకరణ వివిధ కారణాలతో పూర్తి స్థాయిలో స్వచ్ఛ ఆటోలో వేయడం లేనందున అక్కడ తడి, పొడి చెత్తను వేయడానికి బిన్లను ఏర్పాటు చేసుకున్న పక్షంలో సంబంధిత బిన్లలో వేసిన చెత్తను స్వచ్ఛ ఆటో తీసుకొని పోయేందుకు సులభతరం అవుతుందని కమిషనర్ తెలిపారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద చెత్త వేయకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఫెన్సింగ్ లేని ట్రాన్స్ఫార్మర్ల వివరాలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పార్కుల వద్ద పరిశుభ్రంగా ఉండేలా డస్ట్ బిన్లను ఏర్పాటు చేయాలన్నారు. జంక్షన్ల వద్ద వాహనదారులకు ఆహ్లాదకరంగా ఉండేలా పూల మొక్కలు ఏర్పాటు చేయాలని యూబీడీ అధికారులను కమిషనర్ ఆదేశించారు. పశువులు రోడ్లపై తిరగడంతో ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున సంచరించకుండా క్షేత్రస్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.