అర్హత సాధిస్తే చాలు..ప్రభుత్వ ఖర్చుతో విదేశీ విద్యను అభ్యసించవచ్చు. ప్రతి విద్యాసంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ అవకాశాన్ని ఎస్సీ విద్యార్థులకు కల్పిస్తున్నది. దీంతో ఉత్తమ ప్రతిభ కనబర్చే ఎస్సీ నిరుపేద విద్యార్థులకు అంబేద్కర్ విదేశీ విద్యా నిధి పథకం వరంలా మారింది.ఎస్సీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారి భవిష్యత్‌ను అందంగా తీర్చిదిద్దుకుంటున్నారు. విదేశీ విద్యను అభ్యసిస్తున్న వారిలో మేడ్చల్ జిల్లాకు చెందిన విద్యార్థులే అధికంగా ఉండటంతో రాష్ట్రంలోనే మేడ్చల్ జిల్లా నంబర్‌వన్ స్థానంలో ఉంది.
తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీల అభివృద్ధికి 2016 సంవత్సరంలో అంబేద్కర్ విదేశీ విద్యా నిధి పథకం ప్రారంభించింది. ప్రారంభమైన నాటి నుంచి 2019-20 సంవత్సరం వరకు జిల్లా వ్యాప్తంగా 234 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా వివిధ దేశాల్లో విద్యను అభ్యస్తిస్తున్నారు. విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న వారికి రూ. 46కోట్ల80లక్షల నిధులను ఖర్చు చేశారు. విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు అర్హత సాధించిన ఎస్సీ విద్యార్థులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ప్రతిభ ఉండి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లలేని నిరుపేద ఎస్సీ విద్యార్థులకు ఈ పథకం వరంగా మారింది.
విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు ఎస్సీ విద్యార్థులు టోఫెల్, జీఆర్ఈ, ఐఈఎల్టీస్లో ఉత్తీర్ణత సాధించి వీసా పొంది ఉండాలనేది నిబంధన. అర్హత సాధించిన విద్యార్థులు ఎస్సీ వెల్ఫేర్ కమిషనరేట్, ఎస్సీ వెల్ఫేర్ జిల్లా అభివృద్ధి కార్యాలయాల్లో దరఖాస్తులతో సర్టిఫికెట్లను జతపరిచి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఎస్సీ కమిషనరేట్ కార్యాలయంలో కమిటీ సభ్యులు ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు.ఎంపికైన ప్రతి విద్యార్థికి రూ. 20లక్షల చొప్పున విదేశాల్లో చదివే యూనివర్సిటీలకు ప్రభుత్వం నేరుగా ఆన్లైన్ ద్వారా మొదటి సంవత్సరానికి గాను రూ. 10లక్షలను చెల్లిస్తుంది. మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణత సాధిస్తే రెండో సంవత్సరానికి సంబంధించిన మరో రూ.10లక్షలను ఆయా యూనివర్సిటీలకు ఆన్లైన్ ద్వారా చెల్లించనుంది.
కరోనా నేపథ్యంలో ప్రభుత్వం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఎస్సీ విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా విదేశీ విద్యా నిధి పథకానికి బడ్డెట్లో నిధులు కేటాయించింది. 2020-21 విద్యా సంవత్సరంలో 12 మంది విద్యార్థులను ఎంపిక చేసి విదేశాలకు పంపించగా మరో 9 మందికి సెప్టెంబర్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. దీంతో ఈ విద్యా సంవత్సరంలో 21 మందికి ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు.
విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు అర్హత కల్గిన ఎస్సీ విద్యార్థుల కోసం ప్రభుత్వం అంబేద్కర్ విదేశీ విద్యా నిధి పథకం ప్రారంభించింది. 2020-21 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం విదేశీ విద్యా నిధి పథకానికి ప్రభుత్వం నిధులను కేటాయించింది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు మేడ్చల్ జిల్లా నుంచి 12 మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లగా మరో 9 మంది విద్యార్థులకు సెప్టెంబర్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉంది. అర్హత సాధించిన విద్యార్థులందరికీ ప్రభుత్వం విదేశీ విద్యాపథకం వర్తింప జేస్తుంది. – జి. వినోద్‌కుమార్, -మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అభివృద్ధి అధికారి