e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home హైదరాబాద్‌ నగరం మెరువాలి.. ఆహ్వానం అదరాలి

నగరం మెరువాలి.. ఆహ్వానం అదరాలి

  • కనీవినీ ఎరుగని రీతిలో ప్లీనరీ ఏర్పాట్లు చేయాలి
  • 25న గ్రేటర్‌ గులాబీమయం కావాలి
  • ప్రజాప్రతినిధులు గులాబీ రంగు వస్ర్తాలు ధరించి ప్లీనరీకి రావాలి
  • జిల్లాల నుంచి వచ్చే వారికి ఘన స్వాగతం పలకాలి
  • విజయగర్జనకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి
  • 27న నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాలు నిర్వహించాలి
  • టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌

సిటీబ్యూరో/మేడ్చల్‌, అక్టోబర్‌ 20 (నమస్తే తెలంగాణ): టీఆర్‌ఎస్‌ ఇరవై ఏండ్ల పండుగను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ద్వి దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 25న మాదాపూర్‌ హెచ్‌ఐసీసీ వేదికగా జరిగే ప్లీనరీ, నవంబర్‌ 15న వరంగల్‌లో నిర్వహించే తెలంగాణ విజయగర్జన సభ విజయవంతానికి ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ రెండు సభలకు జిల్లా కమిటీల నుంచి మొదలు ప్రతీ వార్డు, కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చేలా పార్టీ అధినాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.

ఇందులో భాగంగా గత రెండు రోజులుగా వివిధ జిల్లాల నేతలతో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ నియోజకవర్గాల వారీగా సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని నియోజకవర్గాల వారీగా సమీక్ష జరిపిన మంత్రి కేటీఆర్‌ బుధవారం రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్‌- ఉప్పల్‌, కూకట్‌పల్లి- శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం-ఎల్బీనగర్‌, మహేశ్వరం-రాజేంద్రనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ముఖ్యులతో తెలంగాణభవన్‌లో సమావేశమయ్యారు.

- Advertisement -

ఎంపీ కేశవరావు, మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్‌, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్‌ఐసీసీలో జరిగే ప్లీనరీకి వచ్చే నేతలంగా గులాబీ రంగు వస్ర్తాలు ధరించి రావాలన్నారు. ప్లీనరీ రోజు ప్రతి డివిజన్‌ను గులాబీమయం చేయాలని కోరారు.

గ్రేటర్‌లో ఎటుచూసినా గులాబీ జెండా రెపరెపలతో పండుగ వాతావరణం కల్పించాలని సూచించారు. ముఖ్యంగా వివిధ జిల్లాల నుంచి నగరానికి వచ్చే అతిథులు, ప్రజాప్రతినిధులకు భారీ ఎత్తున స్వాగత తోరణాలతో ఆహ్వానం పలకాలన్నారు. క్రమ పద్ధతిలో పార్టీ సంస్థాగత నిర్మాణం జరుగుతున్నదని.. రాబోయే తొమ్మిది నెలల పాటు పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు. పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్‌ శ్రేణులు విజయవంతం చేయాలని సూచించారు.

విజయగర్జనకు సన్నద్ధం కావాలి

నవంబర్‌ 15న జరిగే విజయగర్జనకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని.. ఈ నెల 27న నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాలు నిర్వహించుకోవాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. ప్లీనరీ అనంతరం పార్టీ శ్రేణులకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ ఉంటుందని తెలిపారు. టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజలకు విశ్వాసం ఉందని.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులకు అందేలా కృషి చేయాలన్నారు.

కార్యక్రమంలో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్‌, మైనంపల్లి హన్మంతరావు, కేపీ వివేక్‌, మాధవరం కృష్ణారావు, బేతి సుభాష్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కుర్మయ్యగారి నవీన్‌కుమార్‌, పట్నం మహేందర్‌ రెడ్డి, సురభి వాణీదేవి, దయానంద్‌, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్‌ తీగల అనితాదయాకర్‌ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

అదృష్టంగా భావిస్తున్నా..

  • శేరిలింగంపల్లిలో ప్లీనరీ నిర్వహణ ఆనందంగా ఉంది
  • ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా బ్రహ్మాండమైన ఏర్పాట్లు
  • ప్రభుత్వ విప్‌ అరెకపూడి గాంధీ

మియాపూర్‌, అక్టోబర్‌ 20: ప్రజా ఆకాంక్షను నెరవేర్చడంతో పాటు స్వపరిపాలనను అంది స్తూ ద్వి దశాబ్ది ఉత్సవాలను జరుపుకునేందుకు టీఆర్‌ఎస్‌ సిద్ధమవుతున్నదని.. ఇందుకు శేరిలింగంపల్లి నియోజకవర్గం వేదిక అవుతుండటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని ప్రభుత్వ విప్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. హైటెక్స్‌లో ఈ నెల 25న నిర్వహించనున్న ప్లీనరీ కోసం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు నడుచుకుంటూ ప్లీనరీకి హాజరయ్యే ప్రజాప్రతినిధులకు ఏ చిన్న అసౌకర్యం కలుగకుండా వసతులను కల్పిస్తున్నామన్నారు. భోజనం, పార్కింగ్‌, తాగునీరు ఇలా అన్ని రకాల ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నామని వివరించారు. సభకు 300 మంది వరకు మీడియా ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉందని.. వీరందరికీ ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూసుకుంటామన్నారు.

పరిశీలిస్తూ.. దిశానిర్దేశం చేస్తూ..

మాదాపూర్‌, అక్టోబర్‌ 20: ప్లీనరీ పనులను వివిధ ఆహ్వాన కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. బుధవారం మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ విప్‌ అరెకపూడి గాంధీ, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ బాలమల్లు, సివిల్‌ సైప్లె చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, కార్పొరేటర్లు వి. జగదీశ్వర్‌గౌడ్‌, రాగం నాగేందర్‌ యాదవ్‌, ఉప్పలపాటి శ్రీకాంత్‌తో పాటు ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ అధికారులు హైటెక్స్‌కు చేరుకొని అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.

అంతేకాక సభా ప్రాంగణం, వేదిక, పార్కింగ్‌, ట్రాఫిక్‌ ఇబ్బందులపై చర్చించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సంబంధిత ఇన్‌చార్జిలకు సూచించారు. భద్రత, ట్రాఫిక్‌కు సంబంధించిన అంశాలపై పోలీసులు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో మాదాపూర్‌ టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్‌ యాదవ్‌, హఫీజ్‌పేట్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు బాలింగ్‌ గౌతమ్‌ గౌడ్‌, వాలా హరీష్‌ రావు, శ్రీనివాస్‌ నాయక్‌ పాల్గొన్నారు.

15 వేల మందికి 29 రకాల వంటకాలు

కేపీహెచ్‌బీ కాలనీ, అక్టోబర్‌ 20: ప్లీనరీకి హాజరయ్యే ప్రజాప్రతినిధులందరికీ నోరూరించే వంటకాలను వడ్డించనున్నట్లు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం హైటెక్స్‌లో భోజన ఏర్పాటు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు భోజన ఏర్పాట్ల బాధ్యతను నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. 29 రకాలను వండటంతో పాటు 15 వేల మందికి సరిపడా వంటకాలను సిద్ధం చేస్తామన్నారు. శాఖాహారం, మాంసాహారంతో పాటు అందరికీ తాగునీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్లీనరీకి వచ్చే ప్రజాప్రతినిధులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు.

సమన్వయంతో విజయవంతం చేస్తాం

ప్లీనరీ, విజయగర్జన సభను విజయవంతం చేసేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నాం. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. కార్యకర్తలు, పార్టీ శ్రేణులను సమన్వయ పరస్తూ రెండు సభలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తాం. – ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement