హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కు వద్ద రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ క్రిశాంక్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా క్రిశాంక్ మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఏం ఇచ్చాడో మోదీ చెప్పకుండా.. అప్రస్తుతంగా, అసందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదన్నారు. వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకుని రైతులకు క్షమాపణ చెప్పినట్లే.. తెలంగాణ సమాజానికి నరేంద్ర మోదీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వ్యతిరేకంగా మాట్లాడటం మోదీకి అలవాటైపోయిందన్నారు. సీఎం కేసీఆర్ దీక్ష ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్ర ఏర్పాటులో మోదీ పాత్ర లేనే లేదు. ఆయన అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారన్న విషయం గ్రహించాలన్నారు. మోదీ ప్రధానమంత్రిగా కొనసాగినంత కాలం తెలంగాణకు న్యాయం జరగదు అనే విషయం నిన్నటి స్టేట్మెంట్తో అర్థమైందన్నారు. మోదీ క్షమాపణ చెప్పే వరకు తెలంగాణ ప్రజలందరూ బీజేపీపై పోరాడుతూనే ఉంటామని క్రిశాంక్ స్పష్టం చేశారు.