Kanthi Dutt | బంజారాహిల్స్, డిసెంబర్ 1: చదివింది పదోతరగతి.. ఆకట్టుకునే రూపం.. అనర్గళంగా ఇంగ్లీష్‌లో మాటలు.. ఇంటర్నేషనల్ బిజినెస్ అంశాలపై అవగాహన.. వీటినే పెట్టుబడిగా పెట్టి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా అనేకమంది సెలబ్రిటీలను మోసం చేసి.. ఫోర్జరీ కేసులో అడ్డంగా దొరికిపోయిన తృతీయ జ్యువెలరీ సంస్థ అధినేత కాంతిదత్ తోనంగిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం కోర్టులో హాజరుపర్చగా 14రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతూ మధ్యలోనే ఆపేసిన కాంతిదత్ తోనంగి(24) కుటుంబ సభ్యులతో కలిసి నగరానికి వచ్చాడు.
వచ్చినప్పటినుంచే తనకున్న ఆంగ్లభాషా ప్రావీణ్యాన్ని ఉపయోగించుకుంటూ బిజినెస్ మ్యాగజైన్లతోపాటు వ్యాపార సంబంధమైన అంశాల పై ఆసక్తిని పెంచుకున్నాడు. 17ఏండ్ల వయస్సులోనే స్పార్టన్ మీడియా పేరుతో ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను ఏర్పాటు చేసి.. 2019లో శిల్పకళావేదికలో ఓ భారీ కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఆ ఈవెంట్లో శిల్పారెడ్డి అనే ప్రముఖ డిజైనర్‌తో పరిచయం పెంచుకుని ఏడాదిన్నర క్రితం బంజారాహిల్స్ రోడ్ నం. 12, ఎమ్మెల్యే కాలనీ రోడ్డులో సస్టెయిన్ కార్ట్ అనే ఈ కామర్స్ ఫ్లాట్‌ఫారమ్ ఏర్పాటు చేశా డు. ఈ క్రమంలో అనేకమంది సెలబ్రిటీలతో పరిచయాలు ఏర్పరుచుకుని.. వారికి షేర్లు ఇస్తామంటూ మోసాలు చేయడం ప్రారంభించాడు.
ఇదే క్రమంలో నగరానికి చెందిన తిప్పాల శ్రీజ అనే మహిళా వ్యాపారవేత్తతో పరిచయం పెంచుకుని, ఆమెతో కలిసి జూబ్లీహిల్స్ రోడ్ నం. 36లో తృతీయ జ్యువెలర్స్ సంస్థను ప్రారంభించాడు. రూ.2.50కోట్లు తీసుకుని మోసం చేయడంతో పాటు ఆమె సంతకాలను ఫోర్జరీ చేసి ఆమెను డైరెక్టర్‌గా తొలగించాడు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు కాంతిదత్‌ను అరెస్ట్ చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు. కాగా.. అరెస్టయిన కాంతిదత్ గతంలో తృతీయ జ్యువెలర్స్‌లో పెట్టుబడి పేరుతో ఖతార్‌కు చెందిన ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త ప్రవీణ్‌కుమార్‌ను రూ.6కోట్లు మోసం చేయడంతో నవంబర్ 15న సీసీఎస్‌లో చీటింగ్ కేసు నమోదయినట్లు విచారణలో తేలింది.
దీంతోపాటు కాంతిదత్ మీద మాదాపూర్ పీఎస్‌లో హిట్ అండ్ రన్ కేసు సైతం నమోదయిందని తెలిసింది. జూలై 14న కొండాపూర్ నుంచి హైటెక్ సిటీవైపు వస్తున్న బంజారాహిల్స్‌కు చెందిన రాపిడో బైక్ డ్రైవర్ రాజశేఖర్‌ను తన బెంజ్‌కారుతో డీకొట్టడంతో రెండ్రోజుల తర్వాత చికిత్స పొందుతూ అతను మృతిచెందినట్లు తేలింది. యాక్సిడెంట్ తర్వాత కనీసం కారు ఆపకుండా వెళ్లిపోవడంతో ఓ యువకుడు వీడియో తీసి నెలరోజుల తర్వాత మృతుడి కుటుంబ సభ్యులకు పంపించడంతో ఈ వ్యవహారంపై కేసు నమోదయినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో పాటు జూబ్లీహిల్స్ రోడ్ నం .25లోని నయోమీ రెస్టారెంట్ వ్యవహారంలో కూడా కాంతిదత్ మీద ఫోర్జరీ కేసు నమోదయినట్లు విచారణలో వెల్లడయింది. కాంతిదత్ బాధితుల్లో హీరోయిన్ కాజల్ అగర్వాల్, కీర్తిసురేశ్, డిజైనర్ శిల్పారెడ్డి , తదితరులు ఉన్నారని వెల్లడయింది.