 
                                                            సిటీబ్యూరో, అక్టోబర్ 30(నమస్తే తెలంగాణ) : ఓ నిర్మాణ సంస్థకు టీజీ రెరా విధించిన జరిమానా విషయంలో టీజీ రెరా ట్రిబ్యునల్ షాకిచ్చింది. రియల్ ఎస్టేట్ పరిశ్రమలో కీలకంగా మారిన నేపథ్యంలో..సనాలి హౌసింగ్ ప్రాజెక్టు కంపెనీపై విధించిన జరిమానా మొత్తాన్ని తిరిగి చెల్లించాలని రెరాను ఆదేశించింది. గతంలో విధించిన జరిమానా ఉత్తర్వులు చట్ట పరంగా లేవని పేర్కొంది. భూ యజమానులు, డెవలపర్ల మధ్య ఒప్పందమే కానీ, వారు వినియోగదారులు కాలేరని వ్యాఖ్యానించింది.
జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్లు అమలు చేసే భూ యజమానులు ఎన్నటికీ వినియోగదారులు కాలేరని, కో ప్రమోటర్లుగానే పరిగణించాల్సి ఉంటుందని వెల్లడించింది. రెరా ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ సంతోష్ రెడ్డి, సభ్యులు ప్రదీప్ కుమార్ రెడ్డి, చిత్రారామచంద్రన్లతో కూడిన ధర్మాసనం ఈ అంశంలో తీర్పునిచ్చింది. సనాలి హౌసింగ్ కంపెనీ, కో ప్రమోటర్ల మధ్య నెలకొన్న వివాదంలో గతంలో టీజీ రెరా జరిమానా విధించింది. దీనిపై సనాలి బృందం ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా.. వాణిజ్యపరమైన అంశాలు రెరా పరిధిలోకి రావని, సివిల్ కోర్టులో పరిష్కరించుకోవాలని సూచించింది. సనాలి హౌసింగ్ ప్రాజెక్ట్స్‌పై విధించిన జరిమానా మొత్తాన్ని తిరిగి చెల్లించాలని రెరాకు సూచించింది.
 
                            