ఖైరతాబాద్, మే 17 : నిలబడ్డా.. కూర్చున్నా ఆయాసం, గుండె దడతో కూలబడిపోయే వారు. తల్లిదండ్రుల పేదరికం వారికి సరైన వైద్యాన్ని అందించలేకపోయాయి. ప్రైవేట్ దవాఖానలకు వెళితే రూ.10లక్షల నుంచి రూ.15లక్షల వరకు ఖర్చవుతాయని చెప్పడంతో గాంధీ దవాఖానకు చేరుకున్నారు. అక్కడి వైద్యుల సలహాతో నిమ్స్ దవాఖానను సంప్రదించారు. ఒకరికి అత్యంత క్లిష్టమైన సమస్య ఉంటే.. మరొకరికి మరో ఆరుదైన సమస్య బయటపడింది. ఆ ఇద్దరు చిన్నారులకు నిమ్స్ వైద్యులు కొత్త జీవితాన్ని అందించారు. ఆధునిక చికిత్స విధానంతో వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దారు. నిమ్స్ లెర్నింగ్ సెంటర్లో శనివారం సీనియర్ కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఓరుగంటి సాయి సతీశ్ మీడియాకు వివరించారు.
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం, తీగల వంజర గ్రామానికి చెందిన గుమస్తా జాన్పాషా, రంజాన్ దంపతుల కుమారుడు షేక్ నాగుల్ మీరా (15) ఓ ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి పూర్తి చేసి తొమ్మిదో చేరాల్సి ఉంది. నాగుల్ మీరాకు పుట్టుకతోనే గుండె సమస్య ఉన్నట్లు గుర్తించారు. వివిధ దవాఖానల్లో పరీక్షలు నిర్వహించగా, రిపోర్టులు చూసిన వైద్యులు షాక్‌కు గురయ్యారు. అతనికి కుడివైపు గుండె ఉండడంతో పాటు కడుపులో ఎడమవైపు ఉండాల్సి అవయవాలు సైతం కుడివైపు ఉన్నట్లు గుర్తించారు. గుండె కుడివైపు ఉండడాన్ని వైద్య పరిభాషలో డెక్ట్స్కార్డియో అంటారు. అనేక ఆస్పత్రులు తిరిగినా చికిత్స చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. చికిత్స చేస్తామన్న వారు లక్షల్లో ఫీజులు అడిగారు.
వయస్సుతో పాటు వ్యాధి సైతం ముదరడంతో ఒక్కో ఐదు గంటల పాటు గుండె దడ రావడంతో కదలకుండా కుర్చుండిపోయే వాడు. తల్లిదండ్రులు చివరి ప్రయత్నంగా నిమ్స్ దవాఖానలో చేర్పించగా, వైద్యులు ‘వోల్ఫ్ పార్కిన్సన్ వైట్ సిండ్రోమ్’ గా గుర్తించారు. గుండెలో అధిక విద్యుత్ తరంగాలు ప్రవేశించడం వల్ల తీవ్రమైన గుండె దడ వస్తున్నట్లు గుర్తించారు. డాక్టర్ సాయి సతీశ్ నేతృత్వంలో వైద్యుల బృందం బాలుడికి 3డీ మ్యాపింగ్ ద్వారా సమస్య ఉన్న ప్రాంతాన్ని గుర్తించి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ప్రక్రియ ద్వారా చికిత్స నిర్వహించారు.
మరో బాలుడు అల్వాల్‌కు చెందిన జోత్స్న, సిద్ధ పరమేశ్వర్ దంపతుల కుమారుడు సబ్బాని నైమేష్ (14) గత కొంత కాలంగా గుండెదడ సమస్యతో బాధపడుతున్నాడు. పరీక్షించిన వైద్యులు విద్యుత్ తరంగాల హెచ్చుతగ్గుల వల్లే సమస్య ఉన్నట్లు గుర్తించి ఆ బాలుడికి సైతం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చికిత్స అందించగా నయమైంది. ఆర్యోగ్యశ్రీ ద్వారా చికిత్స చేసే వీలుందని, డబ్బు కోసం భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ సాయి సతీశ్ స్వయంగా తమకు అభయమిచ్చారని, ఆయనకు రుణపడి ఉంటామంటూ బాధిత చిన్నారుల తల్లిదండ్రులు మీడియాకు తెలిపారు.