ఖైరతాబాద్, మే 21: దేశంలో జరిగే ఎన్నికలు బ్యాలెట్ విధానంతో నిర్వహిస్తేనే పారదర్శకంగా ఉంటుందని వక్తలు అభిప్రాయపడ్డారు. దలీప్ సంస్థ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ హరగోపాల్ మాటల్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్‌ను బలహీనపర్చిందన్నారు. కమిషన్ పారదర్శకంగా ఉండాలన్నది రాజ్యాంగం నిర్ధారించిన లక్ష్యమన్నారు.
ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల నిర్వహణను విభేదించిన కమిషనర్లందరినీ తొలగింపచేశారన్నారు. ఎన్నికల కమిషనర్‌ను ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నేత, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సభ్యులుగా నియమించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం చీఫ్ జస్టిస్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించిందన్నారు. ఈసీని జేబు సంస్థగా మార్చుకున్నారన్నారు. ఈసీ అనేది నిప్పులాంటి సంస్థ అని, స్వతంత్య్రమైన రాజ్యాంగ సంస్థ అని అన్నారు. ఎన్నికల కమిషన్ దివంగత టీఎన్ శేషన్ హయాంలో ఎంతో పారదర్శకంగా ఉండేదన్నారు.
ఈవీఎంలపై అనుమానం..
బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను బలహీనపర్చడం వలన ఈవీఎంలపై అనుమానం కలుగుతోందన్నారు. కమిషన్‌కు సంబంధించిన డేటా మొత్తం పబ్లిక్ డొమైన్లో ఉండాలన్నారు. కాని అలా జరుగుడం లేదన్నారు. దీనిపై ఉన్న అనుమానాలను సైతం నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర కన్వీనర్ వీవీ రావు మాట్లాడుతూ.. దేశంలో ఈవీఎంల పాత్రపై గతంలోనే అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయన్నారు.
ఈవీఎంపై ఉన్న అనుమానాలను పాలక ప్రభుత్వం నివృత్తి చేయాల్సి అవసరం ఉందన్నారు. గెలిచిన వారు మౌనంగా, ఓడిన వారు మాత్రం ఈవీఎంలో లోపాలున్నాయని చెబుతున్నారని, 2000, 2004, 2009లోనే ప్రముఖ ప్రజాప్రతినిధులు దీనిపై అనేక అనుమానాలను వ్యక్తం చేశారన్నారు.
మాక్ పోలింగ్, ప్రధానమైన ఎన్నికల ఓటింగ్లలో వ్యత్యాసాలు రావడమే అనుమానాలకు దారి తీసిందన్నారు. ఈవీఎం వాడే సాంకేతికత ఏమిటీ, ఎవరు డిజైన్ చేశారు, ఎన్నికల్లో వాడటానికి ఎవరు ప్రారంభించారని తదితర ప్రశ్నలు తలెత్తుతున్నాయని, ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌తో పాటు ప్రభుత్వంపై ఉంటుందన్నారు. ఈ సమావేశంలో దలీప్ సంస్థ అధ్యక్షురాలు బీఎన్ రత్న తదితరులు పాల్గొన్నారు.