సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : ప్రజాపాలన ప్రభుత్వంలో కుదేలైన నిర్మాణ రంగంపై మరో పిడుగు పడింది. ఇప్పటికే రియల్ భూమ్ పడిపోవడంతో ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేక ఢీలా పడిన బిల్డర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మూలికే నక్కపై తాడిపండు పడిందన్న చందంగా వ్యవహరిస్తూ ముప్పుతిప్పలు పెడుతున్నది. రియల్ ప్రోత్సాహకాలు లేకపోగా….భూ బాధితులు, రియల్ వ్యాపారులకు మేలు జరిగే టీడీఆర్(ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్) సర్టిఫికెట్ల జారీని నిలిపివేసింది.
కొత్తగా టీడీఆర్ సర్టిఫికెట్ల జారీ చేయవద్దంటూ తాజాగా సర్కారు నుంచి ఆదేశాలు వచ్చాయని, అందుకే గతంలో మాదిరిగా జీహెచ్ఎంసీ టీడీఆర్‌ల దరఖాస్తులను పరిశీలించడం లేదంటూ ప్లానింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రూ. వందల కోట్ల విలువైన టీడీఆర్‌లు నిలిచిపోయి నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం పడడమే కాకుండా..మరో ఉన్న అందుబాటులో ఉన్న టీడీఆర్‌లకు విపరీతమైన డిమాండ్ నెలకొంది.
జీహెచ్ఎంసీలో నాలా విస్తరణ, ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, రహదారుల విస్తరణ తదితర ప్రాజెక్టులకు అవసరమైన భూమి, ఆస్తుల సేకరణలో నష్టపరిహారంగా నగదు చెల్లింపులకు బదులుగా ప్రవేశపెట్టిన టీడీఆర్ ( ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్) సర్టిఫికెట్ల జారీ నిలిచిపోయింది. గడిచిన కొన్ని నెలలుగా టీడీఆర్‌లు ఇవ్వడంలో కమిషనర్ ఆసక్తి చూపడం లేదు. అప్పుడప్పుడు ఒకటి, రెండు జారీ అయిన సర్టిఫికెట్లు సైతం ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే జరుగుతున్నాయని బిల్డర్లు పేర్కొంటున్నారు. కనీసం రహదారి విస్తరణ పనుల్లో భూమి కోల్పోయిన వారికి సైతం టీడీఆర్ అందుకోవడం బాధితులకు సవాల్‌గా మారింది. టీడీఆర్ దరఖాస్తులకు సంబంధించి కింది స్థాయి అధికారులు పైకి పై స్థాయి అధికారులకు పంపించిన ఏదో కారణంతో తిరస్కరణకు గురై రిటర్న్ పంపిస్తుండడం గమనార్హం.
గ్రేటర్ హైదరాబాద్‌లో వివిధ అభివృద్ధి పథకాలకై చేపట్టే భూ సేకరణ, ఆస్తుల సేకరణ సందర్భంగా జీహెచ్ఎంసీ టీడీపీఆర్ పత్రాలను అందజేస్తున్నారు. అభివృద్ధి పనులకు, ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూమిని సేకరించి, నగదు పరిహారానికి ప్రత్యామ్నాయంగా ఈ టీడీఆర్‌ను ఇస్తున్నారు. ఏదైన ఒక నిర్వాసితుడు నాలా విస్తరణ వల్ల ఏ మేరకు స్థలాన్ని కోల్పోయాడో, అంతకు నాలుగు రెట్లకు టీడీఆర్ పత్రాలను పరిహారంగా పొందుతాడు. ఉదాహరణకు అమీర్‌పేటలో రహదారి విస్తరణలో 20 గజాల స్థలాన్ని కోల్పోయిన నిర్వాసితుడు జీహెచ్ఎంసీ ఇచ్చే 80 గజాల టీడీఆర్ పత్రాన్ని తీసుకుని ఇతరులకు విక్రయించుకునే హక్కు పొందుతాడు.
టీడీఆర్ పత్రం కలిగిన వారు, జీహెచ్ఎంసీ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి ఇచ్చే అనుమతికి అదనంగా చేపట్టే నిర్మాణ వైశాల్యాన్ని నిబంధనలను అనుసరించి క్రమబద్ధీకరించుకోవచ్చు. ఫలితంగా లక్ష రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో..టీడీఆర్ ద్వారా అంతకు రెట్టింపు లేదా, తనకు నచ్చిన మొత్తానికి విక్రయించుకుని లాభపడుతున్నారు. ఎక్కువ శాతం అదనపు అంతస్తు కంటే భవన నిర్మాణం పూర్తయ్యాక తీసుకునే అక్యూపెన్సీ సర్టిఫికెట్ జారీ(ఓసీ) సమయంలో కాంపౌండింగ్ ఫీ చెల్లింపునకు వినియోగించుకుంటున్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో టీడీఆర్‌ల పేరిట కొందరు దందాకు తెరలేపారు. ముఖ్య నేతకు దగ్గర ఉండే ఓ ప్రముఖ బిల్డర్ కనుసైగల్లో ఈ టీడీఆర్‌ల వ్యవహారం జరుగుతున్నట్లు రియల్ వర్గాల్లో ప్రచారం సాగుతున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు 37.32 లక్షల చదరపు గజాల టీడీఆర్ సర్టిఫికెట్లు జారీ చేశారు. వీటిలో రూ.20 లక్షల చదరపు గజాలకు సంబంధించి టీడీఆర్‌లను వినియోగించుకున్నారు. ఇంకా 15.36 లక్షల చదరపు గజాల టీడీఆర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గడిచిన కొన్ని నెలలుగా టీడీఆర్‌లను బ్లాక్ చేసి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పెద్ద మొత్తంలో విక్రయించి నయా దందాలకు పాల్పడుతున్నారు. ఒకప్పుడు ఒక్కో టీడీఆర్ 18 శాతం మొదలైన సర్టిఫికెట్ ప్రస్తుత మార్కెట్లో 53 నుంచి 58 పర్సంటేజీ వరకు చేరడం విశేషం.. ఈ క్రమంలోనే కృత్రిమ కొరతను సృష్టించి చేతిలో ఉన్న టీడీఆర్‌ను డిమాండ్ తగ్గట్టుగా రేటు నిర్ణయించి అమ్మకాలు జరుపుతుండడంతో టీడీఆర్ కొనుగోలు అందరికీ సాధ్యం కావడం లేదన్నది అక్షరసత్యం. కనీసం చిన్నా చితక నిర్మాణాలు చేపడదామంటే టీడీఆర్‌లు బ్లాక్‌లో పెట్టారంటూ బిల్డర్లు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. కాగా, అధికారులు మాత్రం డిమాండ్, సైప్లె ఆధారంగా రేట్లు ఉంటాయని చెబుతున్నారు.