Hyderabad Police | సిటీబ్యూరో, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): కమిషనరేట్ పరిధిలో వివిధ స్థాయిలో పనిచేస్తున్న 273 మంది పోలీస్ సిబ్బందిని బదిలీ చేస్తూ..శుక్రవారం రాత్రి సీపీ శ్రీనివాస్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కొందరు ఇన్స్పెక్టర్లను మల్టీజోన్కు పంపించగా, అక్కడి నుంచి వచ్చిన వారితో పాటు వెయిటింగ్లో ఉన్న కొందరికి పోస్టింగ్‌లు ఇచ్చారు.
బదిలీ అయిన వారిలో 51 మంది ఇన్స్పెక్టర్లు, 81 మంది సబ్ ఇన్స్పెక్టర్లతో పాటు వివిధ పోలీస్స్టేషన్లకు గతంలో అటాచ్మెంట్లో ఉన్న మరో 10 సబ్ ఇన్స్పెక్టర్లు సైతం ఉన్నారు. 141 మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లను బదిలీ చేశారు. ప్రత్యేకంగా ఇందులో 22 మందిని సైబర్‌క్రైమ్‌కు, 16 మందిని సీసీఎస్‌కు కేటాయించారు.
కాగా, సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్)లో భారీ ప్రక్షాళన చేశారు. 81 మంది సిబ్బందిని ఒకేసారి కార్(సిటీ ఆర్మూడ్ రిజర్వు) విభాగానికి అటాచ్ చేశారు. సీపీగా బాధ్యతలు చేపట్టిన తరువాత పంజాగుట్ట ఠాణాలో ఒకేసారి భారీగా బదిలీలు చేసిన విషయం తెలిసిందే. అదే తరహా సీసీఎస్లోనూ తాజాగా బదిలీలు జరిగాయి. కేసుల సెటిల్మెంట్లు, అవినీతి ఆరోపణలు రావడంతో చర్యలు తీసుకున్నారు.