కాచిగూడ,డిసెంబర్ 26: ఇంట్లో ఏసీ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇద్దరు కవలలు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. కాచిగూడ ఇన్స్పెక్టర్ తల్లోజు జ్యోత్స్నా తెలిపిన వివరాల ప్రకారం.. గోల్నాక డివిజన్ సుందర్నగర్, అంజుమన్బాడా కంపౌండ్లోని ఏకేఎం ఎడ్యూకేషనల్లో సయ్యద్ సైపుద్దీన్ ఖాద్రీ సెక్రటరీగా పనిచేస్తున్నాడు.
ఆయనకు ముగ్గురు కుమారులు, కూతురు సంతానం. ఇంట్లో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా ఏసీ షార్ట్ సర్క్యూట్తో దట్టమైన పొగలు, మంటలు చెలరేగాయి. తల్లిదండ్రులు బయట ఉండగా, నలుగురు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. దట్టమైన పొగలు రావడంతో ఇద్దరు పిల్లలు బయటకు పరుగెత్తారు. కవల పిల్లలు రహీంఖాద్రీ(3), రహమాన్ఖాద్రీ(3) మాత్రం ఇంట్లోనే ఉండిపోయారు. అక్కడిక్కడే రహీంఖాద్రీ మృతిచెందగా, రహమాన్ఖాద్రీను ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ కొన్ని గంటలకే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ ఇన్స్పెక్టర్ జ్యోత్స్నా తెలిపారు.