సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలోట్రాఫిక్ ఉల్లంఘనలు పెరిగిపోతున్నాయి. రోజుకు సగటున 30 వేల కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కారణంగానే జరుగుతున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. నగరంలో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడడానికి మౌలిక వసతుల లేమి, ఆక్రమణలు, సిబ్బంది కొరతతోపాటు వాహనదారుల ట్రాఫిక్ ఉల్లంఘనలే కారణమని పోలీసులు చెబుతున్నారు. గత ఎనిమిది నెలల్లో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు 61.2లక్షలు ఉన్నాయంటే వయొలేషన్స్ ఎంత తీవ్రంగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
గతం కంటే ఎక్కువ..!
గతంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాలంటే కొంత భయపడేవారు. పోలీసులు డైరెక్ట్‌గా పట్టుకుని చలాన్లు వేస్తారనో, లేక వాహనాన్ని తీసుకెళ్లి పోలీస్‌స్టేషన్‌లో పెడతారనో భయం ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి తక్కువైంది. ఎక్కువగా నాన్‌కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానాన్ని వినియోగిస్తున్నారు. దీంతో ఈచలాన్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. గత నాలుగేళ్లలో ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. దీనికి కారణం నాన్‌కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్గా పోలీసులు చెబుతున్నప్పటికీ వాహనదారుల్లో భయం తగ్గిందనే అభిప్రాయం కూడా వెల్లడవుతోంది. అంతేకాకుండా ట్రాఫిక్ చలాన్ల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించడం లేదంటూ అధికారులే చెబుతున్నారు.
80శాతం ప్రమాదకరమైన కేసులే..
రహదారి భద్రతకు సంబంధించి అనేక నిబంధనలు ఉన్నాయి. వీటిని పోలీసులు, నిపుణులు మూడురకాలుగా విభజిస్తారు. వాహనదారుడికి ముప్పుగా పరిణమించేది, ఎదుటివారికి ముప్పు కలిగించేది, ఇరువురికి ముప్పుగా పరిణమించేది.. కాగా ఇందులో మూడోకోవకు చెందిన వాటినే ట్రాఫిక్ పోలీసులు సీరియస్‌గా భావిస్తారు. సిగ్నల్ జంపింగ్, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, డ్రంక్‌డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్.. ఇవన్నీ ఈ కోవలోకే వస్తాయి.
హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్లలో ఈ తరహా ఉల్లంఘనలే ఎక్కువగా ఉన్నాయని, అవి కూడా సుమారుగా 80శాతం వరకు ఉంటాయని పోలీసులు చెప్పారు. కమిషనరేట్‌లో ద్విచక్రవాహనాలే ఎక్కువగా ఉండడం వల్ల హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన కేసులే ఎక్కువగా ఉన్నాయని, ఈ సందర్భంలో ఈచలాన్లు పడే అవకాశం ఉంటుంది కాబట్టి కేసుల సంఖ్య పెరుగుతున్నట్లుగా ఓ పోలీస్ అధికారి చెప్పారు. అయితే ఇదే సమయంలో చాలా జంక్షన్లలో రాంగ్‌రూట్ వయొలెషన్స్ విపరీతంగా ఉన్నాయంటూ ఆ అధికారి పేర్కొన్నారు.
నమోదైన కేసులు..!
సంవత్సరం : నమోదైన కేసులు(లక్షల్లో)
2022 : 54.8
2023 : 55.3
2024 : 63.9
2025 : 61.2
(ఆగస్టు వరకు)