మియాపూర్, జూన్ 26: నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్‌ను కట్టడి చేసేందుకు పోలీసు యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తున్నది. నగర వ్యాప్తంగా 250కి పైగా ట్రాఫిక్ సిగ్నళ్లు.. పదుల సంఖ్యలో పాదచారుల క్రాసింగ్‌లు.. కొత్తగా ఫుట్ ఓవర్ వంతెనలు సైతం ఉన్నాయి. వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగానికి తోడు ఇటీవలి కాలంలో వివిధ రంగాలకు చెందిన యువతకు శిక్షణ ఇచ్చి ట్రాఫిక్ వలంటీర్లుగా సిద్ధం చేసి, వారి సేవలను సైతం మూడు కమిషనరేట్ల పరిధిలోని సిగ్నళ్ల వద్ద వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకు ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులను ఇందుకోసం ఎంపిక చేసి గోషామహల్లో ప్రత్యేక శిక్షణను ఇచ్చి, ట్రాఫిక్ నియంత్రణకు ఎలా వ్యవహరించాలో వివరించి క్షేత్రస్థాయిలో సేవలు తీసుకుంటున్నారు.
అయితే, తొలిసారిగా నగరంలో విద్యార్థులు ట్రాఫిక్ వలంటీర్లుగా తమ సేవలను అందించేందుకు సిద్ధమయ్యారు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని పలు ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ఎన్ఎస్ఎస్ వలంటీర్లుగా ఉన్న 300 మంది విద్యార్థినీ విద్యార్థులను ట్రాఫిక్ వలంటీర్లుగా ఎంపిక చేసి, మూడు రోజులుగా శిక్షణను అందిస్తున్నారు. తాజాగా, శిక్షణ పొందిన 300 మందిలో సుమారు 150 మంది విద్యార్థినులు కూడా ఉండటం విశేషం.
ఇప్పటి వరకు ఐటీ రంగంలో పని చేస్తున్న మహిళా ఉద్యోగినులు ట్రాఫిక్ వలంటీర్లుగా శిక్షణ పొంది సేవలను అందిస్తుండగా.. తొలి సారిగా విద్యార్థినీ విద్యార్థులకు ట్రాఫిక్ వలంటీర్లుగా శిక్షణ ఇచ్చి రంగంలోకి దింపుతున్నారు. ఇందుకు గోషామహల్‌లోని ట్రాఫిక్ శిక్షణ కేంద్రం ఇన్స్పెక్టర్ హరీశ్ మూడు రోజులుగా 300 మంది విద్యార్థినీ విద్యార్థులకు ట్రాఫిక్ విధులపై తగిన శిక్షణ అందించారు. శిక్షణ పొందిన విద్యార్థుల జాబితాలను ఆయా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు పంపిస్తామని, అక్కడి ట్రాఫిక్ సీఐలు స్టూడెంట్ వలంటీర్లను సమన్వయం చేసుకుని ప్రతి శని, ఆదివారాల్లో వారి సేవలను క్షేత్రస్థాయిలో వినియోగించుకుంటారని ఇన్స్పెక్టర్ హరీశ్ పేర్కొన్నారు.
ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాఫిక్ విభాగం పోలీసులు ఎంతో శ్రమిస్తున్నారు. వాళ్ల కృషికి హ్యాట్సాఫ్. కళాశాలలో ఎన్ఎస్ఎస్ వలంటీర్‌గా పని చేస్తున్న నేను ట్రాఫిక్ వలంటీరుగా ఎంపికై శిక్షణ పొందడం ఎంతో సంతోషాన్ని ఇస్తున్నది. ట్రాఫిక్ వలంటీర్‌గా ట్రాఫిక్ విభాగం సిబ్బందితో కలిసి నా వంతుగా నియంత్రణకు కృషి చేస్తా.
– నీలిమ, శిక్షణ పొందిన విద్యార్థిని, రిషి మహిళా కళాశాల
ట్రాఫిక్ విధుల నిర్వహణపై గోషామహల్‌లోని శిక్షణ కేంద్రంలో అధికారులు ఎంతో చక్కని శిక్షణను అందించారు. సిగ్నళ్ల వద్ద పాదచారుల క్రాసింగ్‌లు, ఫుట్ ఓవర్ వంతెనల వద్ద ట్రాఫిక్ నియంత్రణ, పాదచారులను క్షేమంగా రోడ్డును దాటించేందుకు ఎలా వ్యవహరించాలో వివరించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను వలంటీరుగా క్షేత్రస్థాయిలో ఆచరణలో పెట్టి ట్రాఫిక్ నియంత్రణకు కృషి చేస్తా.
– నిఖిత, ట్రాఫిక్ వలంటీరు, రిషి మహిళా కళాశాల