Ganesh Immersion | హైదరాబాద్ : గణేశ్ నవరాత్రులు రేపటితో ముగియనున్నాయి. ఇక గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకోనున్నాయి. ప్రధానంగా ఖైరతాబాద్ గణనాథుడిని ఉదయం 11 గంటల వరకు నిమజ్జనం చేసేందుకు అధికారులు, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మరో వైపు బాలాపూర్ గణేశ్ శోభాయాత్రను కూడా వీలైనంత త్వరగా ముగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో శోభాయాత్ర జరిగే ఏరియాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు అమల్లో ఉండనున్నట్లు పోలీసులు తెలిపారు.
ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో వాహనదారులను పోలీసులు అప్రమత్తం చేశారు. ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, నెక్లెస్ రోడ్డు, పీపుల్స్ ప్లాజా వైపునకు సాధారణ వాహనాలను అనుమతించరు. బాలాపూర్ నుంచి వచ్చే ప్రధాన శోభాయాత్ర చార్మినార్, అబిడ్స్, లిబర్టీ, ట్యాంక్‌బండ్ మీదుగా నెక్లెస్ రోడ్ వైపు వెళ్తుంది. సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాలు ప్యాట్నీ, పారడైజ్, రాణిగంజ్, కర్బలామైదాన్ నుంచి ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటాయి. టోలిచౌకీ, మెహిదీపట్నం నుంచి వచ్చేవి ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్ చేరుకుంటాయి. టప్పచబుత్ర, ఆసిఫ్‌నగర్ నుంచి వచ్చే విగ్రహాలకు ఎంజే మార్కెట్లోకి మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రధాన నిమజ్జన రూట్లలో సాధారణ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
సౌత్ ఈస్ట్ జోన్ కేశవగిరి, చాంద్రాయణగుట్ట, మూసారాంబాగ్, చంచల్‌గూడ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు మళ్లింపులు ఉంటాయి. అలియాబాద్, మదీనా, నయాపూల్, ఎంజే మార్కెట్, దరుశ్షిఫా ప్రాంతాలలో ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. శివాజీ బ్రిడ్జ్, పుత్లిబౌలి, హిమాయత్‌నగర్, వైఎంసిఏ ప్రాంతాలలో ఆంక్షలు అమలులో ఉంటాయి. లిబర్టీ, అబిడ్స్, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, బుద్ధభవన్ జంక్షన్లలో వాహనాలను అనుమతించరు.