హైదరాబాద్: పాత సంవత్సరానికి వీడ్కోలు పలికేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. న్యూ ఇయర్ వేడుకలను (New Year Celebrations) భారీగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే హైరదాబాద్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో వేల సంఖ్యలో ఈవెంట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. బేగంపేట, టోలిచౌకి మినహా రాత్రి 10 గంటల నుంచి గురువారం ఉదయం 5 గంటల వరకు ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. రాత్రిపూట ఓఆర్ఆర్పై భారీ వాహనాలకు, విమానాశ్రయానికి వెళ్లే వాహనాలకు మాత్రమే అనుతిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా సిగ్నల్ జంప్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగర వ్యాప్తంగా రాత్రి 8 నుంచి బుధవారం ఉదయం 7 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. డ్రగ్స్ విక్రేతలు, వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పబ్బుల్లో తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు.
ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్‌బండ్ ప్రాంతాల్లో రాత్రి 11 గంటల నుంచి ట్రాఫిక్ అనుమతి ఉండదని పేర్కొన్నారు. అర్థరాత్రి దాటిన తరువాత 2 గంటల వరకు హుస్సేన్ సాగర్ చుట్టూ వాహన రాకపోకలపై అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంక్షలు విధిస్తామన్నారు. నాగోల్ ఫ్లైఓవర్, కామినేని ఫ్లైఓవర్, ఎల్బీనగర్ ఎక్స్ రోడ్‌లోని మల్టీ లెవల్ ఫ్లైఓవర్లు బైరామల్ గూడ ఎక్స్‌రోడ్డులోని మొదటి, రెండో లెవల్ ఫ్లైఓవర్లు ఎల్బీ నగర్ అండర్ పాస్, చింతలకుంట అండర్‌పాస్‌ల మార్గాల్లో రాత్రి 10 గంటల నుంచి ద్విచక్ర వాహనాలు, మోటారు వాహనాలకు, ప్యాసింజర్ వాహనాలకు అనుమతి ఉండబోదన్నారు.
ఇక, మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. సిటీలోని ప్రధాన మార్గాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారని, ఎవరైనా డ్రంక్ డ్రైవ్‌లో దొరికితే వదిలిపెట్టేది లేదన్నారు. కొందరు వ్యక్తుల నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాల ద్వారా ప్రాణాలు పోతున్నాయని, ఈ క్రమంలో సిటీలో మంగళవారం రాత్రి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తామని పోలీసులు చెప్పారు. మద్యం తాగిన వ్యక్తులు తమ సొంత వాహనాలకు డ్రైవర్‌ను పెట్టుకోవడం లేదా క్యాబ్ సర్వీసులను ఉపయోగించడం మంచిదని పోలీసులు సూచించారు.
కాగా, నూత సంవత్సవర వేడుల దృష్ట్యా మెట్రో ప్రయాణ వేళ్లల్లో అధికారులు మార్పులు చేశారు. అర్ధరాత్రి 12.30 గంటల వరకు మెట్రో సర్వీసులను పొడిగించారు. రాత్రి 12.30 గంటలకు ఆఖరి సర్వీసు అందుబాటులో ఉంటుందని అధికారులు చెప్పారు.