హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబర్ సమ్మిట్‌ను (Telangana Global Summit) రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నది. ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం మధ్యాహ్నం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సమ్మిట్ వేధిక అయిన ఫ్యూచర్ సిటీలోని మీర్ఖాన్పేట పూర్తిగా భద్రతా వలయంలో వెళ్లింది. దేశ, విదేశాలకు చెందిన ఫార్చ్యూన్–500 కంపెనీల ప్రతినిధులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, దిగ్గజ పారిశ్రామిక కంపెనీల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరు కానుండటంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో మీర్ఖాన్పేట వచ్చే మార్గాల్లో సోమ, మంగళవారాల్లో ట్రాఫిక్‌ను (Traffic Restrictions) మళ్లించనున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు, సాధారణ ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.
ప్రధానంగా హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి (ఎన్‌హెచ్-765)లో వీడియోకాన్ జంక్షన్ నుంచి తుక్కుగూడ, నెహ్రూ ఔటర్ రోటరీ (ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్-14), హర్షాగూడ, మహేశ్వరం గేట్, కొత్తూర్ క్రాస్ రోడ్స్, పవర్ గ్రిడ్ జంక్షన్ మార్గంలో ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. కొత్తూర్ క్రాస్ రోడ్స్ నుంచి పెద్ద గోల్కొండ, ఓఆర్ఆర్ ఎగ్జిట్-15 మధ్య ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. ఔటర్ నుంచి ఎన్‌హెచ్-765 మీదుగా వచ్చే భారీ వాహనాలు తుక్కుగూడ ఔటర్ (ఎగ్జిట్ నంబర్-14) వద్ద కాకుండా పెద్ద గోల్కొండ, ఓఆర్ఆర్ (ఎగ్జిట్–15) వద్ద మళ్లింపులు తీసుకోవాలని తెలిపారు.
6 వేల మందితో భారీ బందోబస్తు
గ్లోబల్ సమ్మిట్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, కమ్యూనికేషన్స్, ఇంటెలిజెన్స్, బెటాలియన్స్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఏఆర్, స్పెషల్ పార్టీ తదితర విభాగాల నుంచి మొత్తం 6 వేల మంది సిబ్బందిని మోహరించామని, వీరంతా రెండ్రోజులపాటు బందోబస్తు విధుల్లో ఉంటారని ప్రకటించారు. మొత్తం ఆరు అంచెల భద్రత నడుమ ఈ కార్యక్రమం జరుగుతుందని, సమ్మిట్ ప్రధాన వేదిక వద్ద ముగ్గురు అడిషనల్ డీజీలు, ఐదుగురు ఐజీపీలు, 10 మంది ఐపీఎస్‌లు, 170 మంది యువ పోలీస్ అధికారులు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సాంకేతికతలో నిపుణులైన డీసీపీ స్థాయి సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తారని వివరించారు.
పార్కింగ్ మేనేజ్మెంట్కు డీసీపీ స్థాయి అధికారులను నియమించామని, సభాప్రాంగణానికి వచ్చే వీవీఐపీల భద్రత కోసం స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్, ఈవెంట్ సెక్యూరిటీ టీమ్‌లు ఉంటాయని తెలిపారు. వేదికతోపాటు వీవీఐపీలు వచ్చే మార్గాలు, పారింగ్ జోన్లలో 115 నైట్-విజన్, పీటీజెడ్ కెమెరాలు అమర్చామని, ఇవి ప్రధాన కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానమై ఉంటాయని పేర్కొన్నారు. టాఫిక్, భద్రత, సభా ప్రాంగణాన్ని పర్యవేక్షించేందుకు 10 డ్రోన్ బృందాలను మోహరించినట్టు తెలిపారు.