బంజారాహిల్స్, అక్టోబర్ 1 : జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించే ప్రణాళికలో భాగంగా బుధవారం నుంచి కొన్ని మార్పులు చేశారు. రెండేళ్ల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నెం 1, రోడ్ నెం 45 ప్రాంతాల్లో కొన్నిమార్పులు చేసిన సంగతి తెలిసిందే. బీవీబీ స్కూల్ నుంచి అగ్రసేన్ జంక్షన్‌కు వెళ్లే వాహనాలు జర్నలిస్టు కాలనీకి వెళ్లి యూటర్న్ ద్వారా వెళ్లేవి. అగ్రసేన్ చౌరస్తావైపు నుంచి జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వైపు వెళ్లాల్సిన వాహనాలు బీవీబీ జంక్షన్ వద్ద ఎడమవైపు తిరిగి మోహన్‌బాబు ఇంటివద్ద ఉన్న యూటర్న్ ద్వారా సీవీఆర్ చానెల్ మీదుగా వెళ్లేవి.
అయితే ఇటీవల ఈ చౌరస్తాలో ట్రాఫిక్ ఇబ్బందులు పెరగడంతో పాత పద్దతిలోనే రాకపోకలు అనుమతిస్తే ఎలా ఉంటుందనే విషయంపై అధికారులు ఆలోచిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రయోగాత్మకంగా వారం రోజుల పాటు బీవీబీ జంక్షన్లో పాత పద్దతిలోనే ట్రాఫిక్‌ను అనుమతించాలని నిర్ణయించారు. బుధవారం ట్రాఫిక్ డీసీపీ రాహల్ హెగ్డే బీవీబీ జంక్షన్ వద్ద చేపట్టిన మార్పులను పరిశీలించారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.