Traffic Restrictions | హైదరాబాద్ : రంజాన్ మాసంలో ఇవాళే చివరి శుక్రవారం. ఈ నేపథ్యంలో చార్మినార్ వద్ద ఉన్న మక్కా మసీదులో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఈ ప్రార్థనలకు భారీ సంఖ్యలో ముస్లింలు హాజరు కానున్నారు. చార్మినార్ నుంచి మదీనా వరకు ముస్లింలు ప్రార్థన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ క్రమంలో చార్మినార్, మదీనా, శాలిబండ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. వాహనదారులు సహకరించాలని కోరారు.
నాగుల్చింత, శాలిబండ వైపు నుంచి చార్మినార్ వచ్చే వాహనాలను హిమ్మత్‌పురా జంక్షన్ వద్ద మళ్లించి హరిబౌలి, వోల్గా హోటల్ టీ జంక్షన్ వైపు మళ్లించనున్నారు.
చౌక్ మైదాన్ నుంచి చార్మినార్ వైపునకు వచ్చే వాహనాలను కోట్ల అలిజా లేదా మొఘల్‌పురా వద్ద మళ్లించనున్నారు.
మూసాబౌలి నుంచి చార్మినార్ వైపునకు వచ్చే వాహనాలను మోతిగల్లీ వద్ద మళ్లించి ఖిలావత్ గ్రౌండ్, రాజేశ్ మెడికల్ హాల్, ఫతే దర్వాజా రోడ్డు వైపు మళ్లించనున్నారు.
ఈతేబర్ చౌక్ పరిసర ప్రాంతాల నుంచి గుల్జార్ హౌజ్‌కు వచ్చే వాహనాలను మండి మీరాలం మార్కెట్ లేదా బీబీ బజార్ వైపు మళ్లించనున్నారు.
గుల్జార్ ఫంక్షన్ హాల్ – మదీనా, పత్తర్ఘటి వైపు నుంచి వచ్చే వారు గుల్జార్ ఫంక్షన్ హాల్ వద్ద తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి.
ముఫీద్ ఉల్ ఆనం గ్రౌండ్ పార్కింగ్ – యాకుత్‌పురా, నూర్ఖాన్ బజార్, తలాబ్ కట్టా, డబీర్‌పురా నుంచి వచ్చే వారు ముఫీద్ ఉల్ ఆనం గ్రౌండ్లో పార్కింగ్ చేసుకోవాలి.
చార్మినార్ బస్సు టెర్మినల్ పార్కింగ్ – చాంద్రయణగుట్ట, ఫలక్‌నుమా నుంచి వచ్చే వారు చార్మినార్ బస్సు టెర్మినల్ వద్ద వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి.
ఏయూ హాస్పిటల్ పార్కింగ్ – సంతోష్ నగర్, తలాబ్ కట్ట, మోఘల్‌పుర నుంచి వచ్చే వారు ఏయూ హాస్పిటల్ పార్కింగ్‌లో వాహనాలను నిలుపుకోవాలి.
ఖిలావత్ గ్రౌండ్ పార్కింగ్ – మిస్రిగంజ్, ఫతే దర్వాజా, హుస్సేనీ ఆలం, పురానాపూల్ నుంచి వచ్చే వారు.. ఖిలావత్ గ్రౌండ్లో తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి.
చార్మినార్‌కు వైపునకు వెళ్లే బస్సులను అఫ్జల్‌గంజ్ వరకే అనుమతించనున్నారు. ఇక జిల్లాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను నయాపూల్ మీదుగా అనుమతించనున్నారు.
ఎంజీబీఎస్ నుంచి మదీనా మీదుగా జిల్లాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను.. చాదర్‌ఘాట్ రోటరీ, నల్లగొండ ఎక్స్ రోడ్, చంచల్‌గూడ, సైదాబాద్ టీ జంక్షన్, ఐఎస్ సదన్, డీఎంఆర్ఎల్ జంక్షన్, మిధాని జంక్షన్, ఎంబీఎన్ఆర్ ఫ్లై ఓవర్, బండ్లగూడ మీదుగా ఆరాంఘర్ వైపునకు అనుమతించనున్నారు.