హైదరాబాద్ : నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ జితేందర్ (DGP Jitender) పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం టీజీఐసీసీలో హైదరాబాద్ (Hyderabad), సైబరాబాద్(Cyberabad) సీపీలు, రెండు పోలీస్ కమిషనరేట్ల ట్రాఫిక్ విభాగం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ట్రాఫిక్ పోలీసులు, అధికారులు అందరూ రోడ్లపై ఉండాలని ఆదేశించారు.
ప్రస్తుతం నగరంలో ట్రాఫిక్ (Traffic) పరిస్థితి, ట్రాఫిక్ రద్దీకి గల కారణాలు, రద్దీని తగ్గించడానికి తీసుకోవలసిన చర్యలను సమీక్షించారు. వాహనాల రద్దీ నియంత్రణకు శ్రద్ధ వహించాలని, ముఖ్యంగా రోడ్డు భద్రతపై దృష్టిని సారించాలని సూచించారు. మోటర్ వాహనాల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. ఏ జంక్షన్ వద్దనైనా సిగ్నల్ సైకిల్ ఆప్టిమైజేషన్ మూడు నిమిషాలకు మించి ఉండరాదని తెలిపారు.
ట్రాఫిక్ ఇంజినీరింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని వెల్లడించారు. ఈ ఛాలన్ నిధులను ఉపయోగించి జిల్లాలవారీగా ట్రాఫిక్ పరికరాల సేకరణ కోసం రేట్ కాంట్రాక్ట్ విక్రేతల ఎంప్యానెల్మెంట్ చేయాలన్నారు. వర్షాకాలంలో జీహెచ్ఎంసీతో సమన్వయం చేసుకుని పరిస్థితులను చక్కదిద్దాలని సూచించారు.