సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగర పరిధిలో సగటు నగరవాసి నిత్యం ఎదుర్కొనేది… ట్రాఫిక్ సమస్య. ఇల్లు దాటి బండి స్టార్ట్ చేశాడంటే ఏ జంక్షన్లో ఎంతసేపు పడిగాపులు కాయాలో కూడా తెలియని విషమ పరిస్థితి. ఏడాదిన్నర, రెండేండ్ల కిందటి వరకు నగరంలో వాహనాల సగటు వేగం 26 కిలోమీటర్లు ఉంటే… ఇప్పుడు అది ఏకంగా 17 కిలోమీటర్లకు పడిపోయింది.
దేశంలోనే ఇతర మెట్రో నగరాల్లో కంటే హైదరాబాద్ నగరంలో మెరుగైన రవాణా వ్యవస్థ ఉండటంతో పాటు అద్భుతమైన నిర్వహణ కారణంగా ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తగ్గాయని కొనియాడిన టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ఇప్పుడు నగరంలో వాహనాల సగటు వేగం దాదాపు 9 కిలోమీటర్లకు పడిపోయినట్లు చూపుతున్నది. అంతేకాదు… ట్రాఫిక్ జంఝాటం అనగానే గుర్తొచ్చే బెంగళూరు నగరానికి మన నగరం పోటీపడుతుండటం ఆందోళన కలిగించే పరిణామం కాగా పుండు మీద పుట్రలా… అప్పుడే ఎండలు దంచి కొడుతుండటంతో నగరంలో వాహనదారుల అవస్థలు వర్ణనాతీతంగా మారనున్నాయి.
కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత ఏడాదిలో నగరంలో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని అందుబాటులోకి రాలేదనేది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రవాణా రంగంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసిన ఫ్లైఓవర్లకు రిబ్బన్ కటింగ్ మినహా కొత్త ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగలేదు. దీనికి తోడు ట్రాఫిక్ నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా తయారు కావడంతో పరిస్థితి తిరోమన దిశలోకి వెళ్లింది. వాస్తవానికి ఏటా రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య పెరుగుతున్నది.
అయితే ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన పెంచడంతో పాటు నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం ద్వారా సమస్య జఠిలం కాకుండా నియంత్రించవచ్చు. కానీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో ఆ ప్రభావం నగరంలోని వాహనాల సగటు వేగంపై గణనీయంగా పడింది. ఫలితంగా గంటకు సగటున 26 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సిన వాహనాలు ఇప్పుడు 17 కిలోమీటర్ల మందగమనంతో ముందుకు కదులుతున్నాయని టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ద్వారా వెల్లడవుతున్నది. వారం రోజులుగా పరిశీలించినా కొన్ని పర్యాయాలు వేగం 16 కి.మీలకూ పడిపోయినట్లు ఇండెక్స్‌లో స్పష్టమవుతున్నది.
కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ) కింద శరవేగంగా ఫ్లైఓవర్లు, ఆర్‌యూబీలు, ఆర్వోబీల నిర్మాణం పూర్తి చేశారు. కేవలం మొదటి దశలోనే భాగంగా 31కి పైగా ఫ్లైఓవర్లు, వంతెనలు అందుబాటులోకి రావడంతో వాహనదారులకు మునుపెన్నడూ లేని ఊరట లభించింది. రెండేండ్ల కిందట నగరంలో వాహనాల సగటు వేగం గంటకు 26 కిలోమీటర్లకు చేరింది. అందుకే అప్పట్లో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల నుంచి హైదరాబాద్ నగరం ప్రశంసలు అందుకున్నది.
పలువురు పారిశ్రామికవేత్తలతో పాటు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు కూడా ట్రాఫిక్ అంశంలో బెంగళూరుతో బేరీజు వేసి అక్కడ ట్రాఫిక్ నరకం… ఇక్కడ సాఫీగా ట్రాఫిక్ ఉందని ఫొటోలతో సహా నగరాన్ని కొనియాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో రవాణా రంగంలో మౌలిక సదుపాయాల కల్పన అనేది అదే వేగం, ప్రభుత్వ చిత్తశుద్ధి అదేరీతిన కొనసాగితే నగరంలోని వాహనదారులకు మరింత ఉపశమనం లభించేది.
టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం… ప్రస్తుతం నగరంలో ట్రాఫిక్ జంఝాటం పుణ్యాన వాహనదారులు రెండేండ్ల కిందట రోడ్లపై గడిపే సమయానికి కంటే ఇప్పుడు అత్యధికంగా గడపాల్సి వస్తున్నదని వెల్లడైంది. ఒకవైపు వాహన వేగం తగ్గడంతో పాటు ట్రాఫిక్ జామ్‌లు కూడా పెరిగిపోవడంతో నిత్యం వాహనదారులు నరకాన్ని చూస్తున్నట్లుగా అర్థమవుతుంది.
ఈ క్రమంలో ప్రస్తుత ట్రాఫిక్ తీవ్రత దృష్ట్యా నగరంలో పది కిలోమీటర్లు ప్రయాణించే వాహనదారుడు ట్రాఫిక్‌లో నిర్ణీత సమయం కంటే అదనంగా గడుపుతున్న సమయాన్ని లెక్కిస్తే ఏడాదికి 85 గంటలు అంటే మూడు రోజులకు మించి 13 గంటలు ఎక్కువగా ఉంటున్నాడు. అయితే 2023తో పోలిస్తే ఇది 2.17 గంటలు అధికం. అదేరీతిన రోజూ 25 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన వాహనదారుడు ఏడాదికి ఏడు రోజుల మీద 16 గంటల పాటు అదనపు సమయాన్ని గడుపుతున్నాడు. రెండేండ్ల కిందటితో పోలిస్తే ఇది ఏకంగా 25 రోజుల ఐదు గంటల అధికం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండలు దంచికొడుతుండటంతో హెల్మెట్లు పెట్టుకొని నగర రోడ్లపై గంటల తరబడి ఉండటమంటే వాహనదారుల బాధలు వర్ణణాతీతం.