Chengicherla | బోడుప్పల్, ఏప్రిల్ 15: భాగ్యనగరానికి కూతవేటు దూరంలో ఉన్న బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్ల ప్రధాన రహదారి విస్తరణ పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదాలకు నెలవుగా మారి అనేక మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న చెంగిచెర్ల ప్రధాన రహదారిపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం…
నివాస ప్రాంతంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న బోడుప్పల్ నగరపాలక సంస్థ చెంగిచెర్ల ప్రధాన రహదారి విస్తరణ పనులకు అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం 2021 – 2022 సంవత్సరానికి టెండర్లను పిలిచి హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) ఆధ్వర్యంలో 40 అడుగుల రోడ్డును వంద అడుగుల రహదారిగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించి పనులు ప్రారంభించింది. ఎన్ ఎఫ్ సి ప్రధాన కూడలి నుంచి ఐఓసీఎల్, చెంగిచెర్ల, ఆర్టీసీ జోనల్ డిపో వరకు 8.4 కిలోమీటర్ల రోడ్డును సుమారు రూ. 40 కోట్ల నిధులతో 80 శాతం రోడ్డు విస్తరణ పనులను అప్పటి ప్రభుత్వం పూర్తి చేసింది. కాగా మిగిలిన 20 శాతం పనులు ఇప్పుడు అర్ధాంతరంగా మధ్యలోనే నిలిచిపోయాయి. హెచ్ఆర్డీసీఎల్ నుంచి బాధ్యతలు తప్పిస్తూ సిఆర్ఎంపి(కాంప్రెన్సివ్ రోడ్డు మెయింటనెన్స్)కి రోడ్డు నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం స్థానిక సంస్థలకు అప్పగించింది. సమగ్ర రహదారి సంరక్షణ పనులను స్థానిక నగరపాలక సంస్థకు అప్పగించడంతో నిధుల లేమి కారణంగా పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో చెంగిచెర్ల రహదారిపై ప్రయాణం చేయాలంటనే వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. గుంతల మయంగా రోడ్డు, విచ్చలవిడిగా పార్కింగ్, గాంధీయంగా పెరుగుతున్న వాహనాల సంఖ్యతో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు జటిలంగా మారుతుంది.
పెరుగుతున్న రద్దీ.. పూర్తిగాని రహదారి..!
చెంగిచెర్ల ప్రధాన రహదారి వరంగల్ – హైదరాబాద్ జాతీయ రహదారికి అతి సమీపంలో ఉంటుంది. మరోవైపు ఎన్ఆర్సీఎం (నేషనల్ రీసెర్చ్ సెంటర్ మీట్), ఐఓసీఎల్ (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్) ఈ రహదారిని అనుకోనే ఉంటాయి ముఖ్యంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడంతో వానాల రద్దీ గణనీయంగా పెరిగింది. నాలుగు లైన్ల రోడ్డుకు బీటి పనులు పూర్తి చేయకపోవడంతో వేలాది వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాహనాల సంఖ్య గణనీయంగా పెరగడంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది. రోడ్డు ఎగుడు దిగుడుగా ఉండడం, ఒకవైపు బీటీ రోడ్డు వేసి మరోవైపు వదిలేయడంతో ప్రమాదాల సంఖ్య పెరిగి అనేకమంది మృత్యువాత పడుతున్నారు.
-నిత్యం నరకయాతన అనుభవిస్తున్నాం (బట్టల విక్రాంత్, వాహనదారుడు)
ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం రోడ్ల బాగోగులను పట్టించుకోవడం లేదు. రోడ్డు విస్తరణ పనులు సగం వరకే పూర్తి కావడంతో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురైతున్నాం. గుంతలరోడ్డు కారణంగా ఇటీవల అనేకమంది మృత్యువాత పడ్డ సంఘటనలున్నాయి. నిత్యం వేలాదిగా ప్రయాణిస్తున్న చెంగిచెర్ల రోడ్డు అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలి.