Wrong Route | సిటీబ్యూరో: హైదరాబాద్‌లో సురక్షిత ప్రయాణానికి అనుకూలంగా కమిషనరేట్ పోలీసులు చర్యలు చేపట్టారు. రాంగ్రూట్లో వెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నవారికి చెక్‌పెట్టడానికి డిసైడయ్యారు. నేటి నుంచి స్పెషల్‌డ్రైవ్ చేపడుతున్నట్లు ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. ప్రమాదాలకు కారణమవుతున్న రాంగ్‌రూట్ డ్రైవింగ్, నంబర్‌ప్లేట్ ట్యాంపరింగ్‌పై ప్రధానంగా దృష్టిపెట్టారు. నగరంలోని అన్ని కూడళ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనదారులు సురక్షితంగా ప్రయాణం చేసేందుకు అనువుగా ట్రాఫిక్ క్రమబద్ధ్దీకరించడంతోపాటు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
రాంగ్‌రూట్‌పై హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. వాహనదారులు రాంగ్రూట్లో వాహనాలను నడపడం వల్ల ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఎదురవడంతో పాటు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా నంబర్‌ప్లేట్లపై పోలీసులు దృష్టిపెట్టారు. మోటార్ వాహనాల చట్టం ప్రకారం నంబర్‌ప్లేట్‌ను సులభంగా కన్పించే విధంగా పెట్టుకోవాలని ఆర్టీఏ అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ రాంగ్‌రూట్, నంబర్‌ప్లేట్ ఉల్లంఘనలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని పోలీసులను ఆదేశించారు. రాంగ్‌రూట్, నంబర్‌ప్లేట్లపై సోమవారం నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జోయల్‌డేవిస్ తెలిపారు.