సిటీబ్యూరో, జూన్ 4 (నమేస్తే తెలంగాణ): ఔటర్ రింగు రోడ్డు ఇంటర్ చేంజ్ల వద్ద శాస్త్రీయంగా నిర్మాణం చేపట్టకపోవడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలకు దారి తీస్తోంది. గ్రేటర్ చుట్టూ 158 కి.మీ. మేర నిర్మించిన ఔటర్ రింగు రోడ్డుపై 21 చోట్ల ఇంటర్ చేంజ్‌లను నిర్మించినా.. ఒక్కోచోట ఒక్కో రకంగా నిర్మించారు. ముఖ్యంగా రోటరీలు నిర్మించిన చోట వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఓఆర్ఆర్ మీదుగా వచ్చే వాహనాలు కిందకు దిగే సమయంలో వృత్తాకారంలో రోటరీ నిర్మించడంతో అక్కడ ఒకేసారి 5 మార్గాల నుంచి వాహనాలు వస్తున్నాయి. దీంతో ఆ రోటరీ చుట్టూ తిరిగి వెళ్లే సమయంలో కొందరు వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు. అదే సమయంలో వాహనాల రద్దీ పెరిగినప్పుడు ఒక్కసారిగా రోటరీ చుట్టు వాహనాలు బారులు తీరుతుండటంతో ట్రాఫిక్ సమస్యలకు దారి తీస్తోంది. ఆయా రోటరీల వద్ద తరచూ ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహించకపోవడంతో ట్రాఫిక్ తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. ఈ రోటరీలు అత్యధికంగా ట్రాఫిక్ రద్దీ ఉండే నానక్‌రాంగూడ, నార్సింగి, తెలంగాణ పోలీస్ అకాడమీ ఓఆర్ఆర్ ఇంటర్‌చేంజ్‌లలో ఉన్నాయి.
రీ డిజైన్‌తోనే పరిష్కారం..
నగర శివారు ప్రాంతమైన నానక్‌రాంగూడ ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ చుట్టు పక్కల భారీ సంఖ్యలో ఆకాశహార్మ్యాలు నిర్మాణంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ కూడలిలో ఖాజాగూడ వైపు రోడ్డుకు ఇరువైపులా 22 అంతస్తుల నుంచి మొదలుకొని 36 అంతస్తులతో భారీ బహుళ అంతస్తుల వ్యాపార, వాణిజ్య భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. కూడలికి మరోవైపు సుమారు 10 భారీ భవనాల నిర్మాణం పూర్తి కాగా, మరో ఐదు భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇవన్నీ 10 నుంచి 36 అంతస్తుల వరకు ఉండటంతో భవిష్యత్తులోనూ ఈ కూడలి చుట్టు పక్కల భారీ ఎత్తున వాహనాల రాకపోకలు ఉండనున్నాయి. దీంతో భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు తారా స్థాయికి చేరుకుంటాయని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నాయి. ఔటర్ రింగు రోడ్డును నిర్మించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అధికారులు దీనిపై ప్రత్యేకంగా అధ్యయనం చేయాలని, ఇంటర్‌చేంజ్‌ను రీ డిజైన్ చేసి ట్రాఫిక్ చిక్కులు లేకుండా వాహనాల రాకపోకలు సాగేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ట్రాఫిక్ నిపుణులు సూచిస్తున్నారు.
శరవేగంగా విస్తరిస్తున్న ఐటీ కారిడార్..
ప్రస్తుతం రాయదుర్గం వరకు ఉన్న మెట్రో రైలు మార్గాన్ని ఐటీ కారిడార్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌లు సిద్ధమవుతున్నాయి. నగరం నలుమూలల నుంచి ఐటీ ఉద్యోగులు, భవన నిర్మాణ రంగంలో పనిచేసే వారు, ఇతరులు ఈ ప్రాంతానికి నిత్యం రాకపోకలు సాగించే అవకాశం ఉండటంతో నానక్‌రాంగూడ కూడలి అత్యంత కీలకంగా మారనున్నది. ఈ నేపథ్యంలో రోటరీ తరహాలో ఉన్న కూడళ్ల డిజైన్‌పై పట్టణ ట్రాఫిక్ నిపుణులతో అధ్యయనం చేసి ఇంటర్‌చేంజ్‌ల వద్ద ఎదురయ్యే ట్రాఫిక్ చిక్కులకు పరిష్కార మార్గాలను కనుగొనాల్సిన బాధ్యత హెచ్ఎండీఏ అధికారులపై ఉన్నది. ముఖ్యంగా.. ఐటీ కారిడార్‌లో అభివృద్ధి శరవేగంగా చోటు చేసుకోవడంతో పరిస్థితులు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఓఆర్ఆర్తో అనుసంధానం ప్రారంభమయ్యే గచ్చిబౌలి నుంచి మొదలుకొని తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు, గచ్చిబౌలి ట్రిపుల్ కూడలి నుంచి మొదలుకొని కోకాపేట ఇంటర్చేంజ్ వరకు ఐటీ కారిడార్ ప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతాల్లోనే ఐటీ కంపెనీలతో పాటు నివాస ప్రాంతాలు భారీ సంఖ్యలో వస్తుండటంతో ఇక్కడి రోడ్లు, ట్రాఫిక్ కూడళ్లు సరిపోయే పరిస్థితి లేదని ట్రాఫిక్ నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి తోడు ఐటీ కారిడార్ పరిధి తర్వాత ఉన్న హైదరాబాద్- బీజాపూర్ రోడ్డు జాతీయ రహదారి ప్రారంభమయ్యే తెలంగాణ పోలీస్ అకాడమీ ఇంటర్చేంజ్ వద్ద ఉన్న రోటరీలు ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమవు తున్నాయని గుర్తించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తున్న ఇంటర్చేంజ్ కూడళ్లపై సమగ్రంగా అధ్యయనం చేసి శాశ్వత పరిష్కార మార్గం చూపాలని వాహనదారులు కోరుతున్నారు.