Begum Bazar | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని బేగంబజార్‌లో వ్యాపారులను ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతూ ఉన్నాయి. ఉండేదే ఇరుకు రోడ్లు అంటే.. అక్కడక్కడ విస్తరణ చేపట్టడం, పాత రోడ్డును తొలగించి కొత్త నిర్మాణాలు చేపట్టడంతో.. నిత్యం బేగంబజార్‌లో ట్రాఫిక్ ఏర్పడుతుంది. దీంతో వ్యాపారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో బేగంబజార్ లోపలికి వాహనాలను అనుమతించడం లేదు. టూ, త్రీ వీలర్స్ వెళ్లినప్పటికీ.. ఎక్కడో చోట ట్రాఫిక్‌లోనే ఇరుక్కుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బేగంబజార్‌లో ఎక్కడ చూసినా 20 ఫీట్ల వెడల్పుతోనే రోడ్లు ఉన్నాయి. ఇది కూడా ట్రాఫిక్‌కు ఒక కారణమని వ్యాపారులు పేర్కొన్నారు. ఇక్కడ దాదాపు 2 వేల వరకు షాపులు ఉన్నాయని, రోజుకు 30 వేల మంది వరకు వ్యాపార నిమిత్తం బేగంబజార్‌కు తరలివస్తుంటారని తెలిపారు. రోజుకు 10 నుంచి 30 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుందన్నారు. వ్యాపార కేంద్రంగా ఉన్న బేగంబజార్‌లో రోడ్ల విస్తరణ చేపట్టి, వ్యాపారులకు లాభం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రహదారి నిర్మాణ పనులు వ్యాపార కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయని స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. వస్తువులను తరలించేందుకు కూడా కష్టంగా ఉందన్నారు.
భవిష్యత్‌లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. బేగంబజార్‌లో రహదారి నిర్మాణ పనులను రూ. 18 లక్షలతో చేపట్టామని జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఇంజినీర్ కల్లమ్మ చెప్పారు. బేగంబజార్లోకి వచ్చే దారులతో పాటు మిగతా ప్రాంతాల్లో రాత్రి వేళ పనులు చేపడుతున్నామని, నెలరోజుల్లో వర్క్స్ పూర్తవుతాయని పేర్కొన్నారు.