Traffic Problem | బేగంపేట, ఏప్రిల్ 24: సికింద్రాబాద్ రాణిగంజ్, జనరల్ బజార్ ఏరియాల్లో నిత్యం ట్రాఫిక్ జాంలు ఏర్పడుతున్నాయి. నిత్యం వాహనదారుల, పాదాచారుల రాకపోకలతో పాటు వేసవి కాలంలో కాడవంతో ఏసీ, కూలర్ల మార్కెట్లు ఏర్పాటు కావడంతో మరింత రద్దీగా మారాయి.
సాధారణ రోజుల కంటే వేసవి కాలంలో ఇక్కడ వివిధ రకాల వస్తువుల కొనుగోళ్ల కోసం నిత్యం వేలాది మంది వినియోగదారులు మార్కెట్‌ను సందర్శిస్తుంటారు. వీటికి తోడు వెడ్డింగ్ కార్డ్స్ దుకాణాలు, పెళ్లిళ్లకు అవసరమైన బట్టలు, బడి బాసాన్లు, బంగారు ఆభరణాల దుకాణాలు అధిక సంఖ్యలో ఇక్కడ వెలిశాయి. దీంతో ఈ ప్రాంతంలో వినియోగదారులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ జనరల్ బజార్, రాణిగంజ్, రాష్ట్రపతి రోడ్డు, మహాత్మాగాంధీ రోడ్డు, సుబాష్ రోడ్డు, మోండా ప్రాంతాలలో ఎక్కడా కూడా వాహనాల పార్కింగ్ ప్రదేశాలు లేవు. దీంతో మార్కెట్లకు వచ్చిన వినియోగదారులు, దుకాణదారుల బండ్లు కూడా రోడ్లపై పార్కింగ్ చేయాల్సి వస్తుంది. దీంతో రోడ్డు రాకపోకలు సాగించలేక వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
రాణిగంజ్, జనరల్ బజార్, సుభాష్ రోడ్లపై ట్రాఫిక్ జాం అయిందంటే సుమారు 15 నుంచి 20 నిమిషాలు వరకు ఆగాల్సి వస్తుంది. ఇలా రోజంతా ఇలాగే అక్కడ ట్రాఫిక్ ఆగిపోతున్నది. ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్యలను తీర్చాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ప్రాంతాలకు వచ్చే వారి కోసం సమీప ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పార్కింగ్ కల్పించి, రోడ్లపై వాహనాలు నిలపకుండా చూడాలని కోరుతున్నారు.