Goshamahal | అబిడ్స్ ఫిబ్రవరి 23 : గోషామహల్ ప్రధాన రహదారిలో నాలా పైకప్పు కూలడం వలన వాహనాల రాకపోకలను దారి మళ్లిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ రహదారి మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. అక్కడి హోల్సేల్ వ్యాపారులు దుకాణాలు మూసుకునే దుస్థితి ఏర్పడింది. అధికారుల నిర్లక్ష్యం ఇటు వ్యాపారులకు అటు ప్రజలకు శాపంగా పరిణమించింది. గత ఏడాదిన్నర కాలంగా గోషామహల్ చాక్నవాడి నాలా పైకప్పు ఇప్పటికీ ఆరుసార్లు కుప్ప కూలింది.
బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాక్ నావాడి నాలా ఒక్కసారిగా కుప్పకూలి పోలిపోవడంతో పలు వాహనాలు ధ్వంస మయ్యాయి. ఆ నాలా పైకప్పు పూర్తి అయ్యిందో లేదో మరోమారు నాలా మరోవైపు కుప్పకూలి పరిస్థితి మొదటికి వచ్చింది. తదనంతరం గత మూడు మాసాల్లో మూడుసార్లు నాలా పైకప్పు కుప్పకూలి ప్రజలకు ఎటు పాలుపోని పరిస్థితి దాపురించింది. తాజాగా పాత ముంబై హైవే దారుసలాం నుంచి గోషామహల్ వెళ్లే ప్రధాన రోడ్డుపై చాకనావాడి మలుపు వద్ద శుక్రవారం రాత్రి నాలాపై ఉన్న రోడ్డు కుప్ప కూలింది. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలతో స్థానికులు, వ్యాపారులు బెంబేలెత్తి పోతున్నారు.
పాత ముంబై హైవే రహదారి కావడంతో ఈ రోడ్డుపై నిత్యం వేల సంఖ్యలో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. శుక్రవారం రాత్రి జరిగిన ఘటనతో అంతర్రాష్ట్ర రహదారికి దారి తీసే రెండు వైపులా పోలీసులు, జిహెచ్ఎంసి అధికారులు కలిసి దారి మూసివేస్తూ బారీకేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో గోషామహల్ అలాస్కా వద్ద ఇటు దారుసలాం కూడలి వద్ద బారీకెడ్లు ఏర్పాటు చేసి రోడ్లు మూసివేశారు.
ఈ ప్రాంతంలో టింబర్ డిపోలు, ప్లైవుడ్, శానిటరీ, హార్డవేర్, హోల్ సేల్ దుకాణాలు సుమారు రెండు వందల వరకు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం రోడ్డు తిరిగి ప్రారంభించాలంటే కనీసం రెండు నెలలు పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు తమ వ్యాపారాల పరిస్థితి ఏమిటంటూ వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. శాశ్వత పరిష్కారం లేదా అంటూ అడుగుతున్నారు. నాలా ఎక్కడ ప్రారంభం అయ్యి ఎక్కడ ముగుస్తుందో అక్కడి వరకు పూర్తిగా పునర్ నిర్మిస్తే తప్ప సమస్య శాశ్వత పరిష్కారం అయ్యేలా కనిపించడం లేదు. కూలినప్పుడల్లా కంటి తుడుపు చర్యగా పనులు చేసి చేతులు దులుపుకుంటే ఎలా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.