ఇంటర్చేంజ్, విస్తరణ పనులు
పోలీస్ అకాడమీ నుంచి నార్సింగి, కోకాపేట వెళ్లే మార్గంలో
ఒకవైపే రాకపోకలు
సిటీబ్యూరో,జూన్ 18 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగు రోడ్డు చుట్టూ ఉన్న సర్వీసు రోడ్లపై ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు హెచ్ఎండీఏ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు. ఐటీ కారిడార్‌లోని ఔటర్ రింగు రోడ్డు పొడవునా సర్వీసు రోడ్డు విస్తరణ, ఇంటర్‌చేంజ్‌ల నిర్మాణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు రూ.571 కోట్ల వ్యయంతో నార్సింగి ఇంటర్చేంజ్, కోకాపేట నియోపొలీస్ వద్ద మరో ఇంటర్‌చేంజ్‌లను నిర్మిస్తున్నారు.
అదేవిధంగా నానక్‌రాంగూడ నుంచి నార్సింగి మీదుగా పోలీస్ అకాడమీ వరకు, నార్సింగి నుంచి కోకాపేట మీదుగా కొల్లూరు వరకు సర్వీసు రోడ్లను విస్తరిస్తున్నారు. ప్రస్తుతం నార్సింగి ఇంటర్ చేంజ్ వద్ద తెలంగాణ పోలీస్ అకాడమీకి వెళ్లే మార్గంలో కుడి వైపు పనులు చివరి దశలో ఉన్నాయి. మరో 7-10 రోజుల్లో పనులు పూర్తి కానున్నాయి. దీంతో కొన్ని రోజుల పాటు ఈ మార్గంలో వాహనాలను మళ్లిస్తున్నారు.