Haleem | రంజాన్ పండుగ వచ్చిందంటే చాలు హైదరాబాదీలకు హలీం గుర్తొస్తోంది. నోరూరుతోంది. వేడి వేడిగా, ఘుమఘుమలాడే హలీంను ఆరగించాలని అనిపిస్తోంది. మరి ఈ హలీం బట్టీలు ఒకట్రెండు కాదు.. నగరంలోని ప్రతి వీధిలో దర్శనమిస్తాయి. మటన్, చికెన్ హలీంలను తయారు చేస్తూ.. ఆహార ప్రియులను ఆకర్షించేలా బోర్డులు దర్శనమిస్తాయి. అయితే వందల సంఖ్యలో దర్శనమిచ్చే హలీం సెంటర్లలో కెల్లా.. ఈ పది సెంటర్లలో మాత్రం హలీం సూపర్ టెస్టీగా ఉంటోంది. ఈ సెంటర్లలో తయారు చేసే హలీంకు భారీగానే డిమాండ్ ఉంటోంది. మరి ఆ పది హలీం సెంటర్లు ఏవో తెలుసుకుందాం.. పదండీ..!
పిస్తా హౌస్ బ్రాంచెస్ నగర వ్యాప్తంగా మొత్తం 10 ఉన్నాయి. ఇతర దేశాల్లోనూ ఈ సెంటర్లు ఉన్నాయి. పిస్తా హౌస్‌లో తయారయ్యే హలీంకు భారీ డిమాండ్ ఉంటోంది. మంచి నాణ్యతతో పాటు రుచిగా ఉంటోంది. ప్రతి సెంటర్ వద్ద హలీంను తినేందుకు వందల సంఖ్యలో జనాలు గుమిగూడి ఉంటారు.
కెఫే బహర్ బషీర్‌బాగ్‌లో ఉంది. గత కొన్ని దశాబ్దాల నుంచి కెఫే బహర్ మంచి క్వాలిటీతో హలీంను అందిస్తోంది. ఇక్కడ మటన్ హలీంకు డిమాండ్ ఎక్కువ. మటన్ హలీంను నెయ్యితో కలిపి తయారు చేస్తారు. ఇక్కడ హలీం ఆరగించాలంటే వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే జనాలు అంతగా ఉంటారు.
షాదాబ్ పాత బస్తీలో ఫేమస్. ఇక్కడ హలీం తిన్న తర్వాత ఆ రుచిని మరిచిపోరు. చికెన్ కబాబ్ నుంచి మటన్ బిర్యానీతో పాటు శాఖాహారం కూడా లభిస్తోంది. సాయంత్రం నుంచి మొదలుకుంటే.. తెల్లవారుజాము వరకు హాలీం అందుబాటులో ఉంటుంది.
మాసాబ్ ట్యాంక్ ఫ్లై ఓవర్ సమీపంలో కేఫే 555 ఉంటుంది. ఈ సెంటర్లో మటన్ హలీం ఫేమస్. సరసమైన ధరలకే మంచి రుచితో కూడిన హలీం లభించును. రాత్రి సమయాల్లో ఇక్కడ రద్దీ అధికంగా ఉంటోంది. సింగిల్ ప్యాక్ నుంచి ఫ్యామిలీ ప్యాక్ వరకు హాలీం దొరుకుతోంది.
హైదరాబాద్ నగరంలో బావర్చి పేరు మీద అనేక సెంటర్లు ఉన్నాయి. కానీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోనే బావర్చి సెంటర్.. మరెక్కడా తన సెంటర్‌ను ప్రారంభించలేదు. ఇక్కడ దొరికే హలీం చాలా టెస్టీగా ఉంటుంది. ఈ హలీం రుచి మరెక్కడా ఉండకపోవచ్చు. సాయంత్రం సమయాల్లో ఇక్కడ రద్దీగా ఉంటుంది.
షా గౌస్ లో దొరికే హలీంకు ప్రత్యేకత ఉంది. జీడి పప్పు, ఉడకబెట్టిన కోడిగుడ్డు, వేయించిన ఉల్లిపాయ ముక్కలతో హలీంను తయారు చేస్తారు. ఇలాంటి కాంబినేషన్ హలీం ఎక్కడా దొరకదు. నెయ్యితో కూడిన హలీంను కూడా ఇక్కడ సరఫరా చేస్తారు.
బంజారాహిల్స్‌లోని సర్వీ రెస్టారెంట్ కూడా హలీంకు ఫేమస్. ఇక్కడ పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతమిచ్చి హలీంను తయారు చేస్తుంటారు. సామాన్యులే కాదు.. ఇక్కడ హలీంను ఆరగించేందుకు సినిమా స్టార్లు కూడా వస్తుంటారు. మటన్ హలీం అద్భుతంగా ఉంటుంది.
బెహ్రూజ్ రెస్టారెంట్ మెహిదీపట్నం, టోలీచౌకీలో ఉంది. ఇక్కడ హలీం నోట్లో వేసుకోగానే ఐస్‌క్రీమ్‌లా కరిగిపోతోంది. ఇక్కడ ఘోస్ట్ హలీం ఫేమస్. నిజాం కాలం నుంచి ఇక్కడ హలీం ఫేమస్.
నారాయణగూడలోని మెహ్‌ఫీల్ రెస్టారెంట్ కూడా హలీంకు ఫేమస్. సాయంత్రం సమయంలో ఇక్కడ హలీం తినేందుకు ఆసక్తి చూపుతుంటారు. మటన్ హలీం తినేందుకు జనాలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
ప్యారడైస్ ఫుడ్ కోర్ట్ తెలియని వారుండరు. ప్యారడైస్ హలీం కూడా మంచి రుచిగా ఉంటుంది. రంజాన్ సీజన్ కంటే ముందే ఇక్కడ హలీం ఫెస్టివల్‌ను ప్రారంభించారు.