GHMC | సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీలో వందకు వంద శాతం బహిరంగ మలవిసర్జన రహిత నగరంగా సాధించాలనే లక్ష్యానికి అధికారులు నీళ్లొదిలారు. బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత (ఓడీఎస్ ప్లస్ ప్లస్) నగరంగా హైదరాబాద్కు జాతీయ స్థాయిలో గుర్తింపు ప్రశ్నార్థకంగా మారింది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఓడీఎఫ్, ఓడీఎఫ్ ప్లస్, వాటర్ ప్లస్, స్వచ్ఛ హైదరాబాద్ వంటి ర్యాంకులతో నగరానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. కానీ గడిచిన ఏడు నెలలుగా టాయిలెట్ల నిర్వహణ అధ్వానంగా మారింది.
కనిపించని పబ్లిక్ టాయిలెట్లకు బిల్లులు, వినియోగించని మరుగుదొడ్లకు నిర్వహణ వ్యయం చెల్లించడం జీహెచ్ఎంసీకే చెల్లింది. ప్రతి అరకిలోమీటరు రద్దీ రోడ్లలో మహిళలు, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లను ఏర్పాటు చేయాల్సిన అధికారులు.. ప్రస్తుతం ఆరు జోన్లలో 4,826 సీట్లలో 1,857 పబ్లిక్ టాయిలెట్లను మాత్రమే నిర్మించినట్లు లెక్కలు చెబుతున్నాయి. గతంలో 7,400 టాయిలెట్ల నిర్మించగా, సగానికి పైగా వినియోగంలో లేవు..కొన్ని చోట్ల కనిపించడం లేదు. బిల్లుల చెల్లింపులు మాత్రం యథావిధిగా జరుపుతుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.