కందుకూరు, జూన్ 27 : కందుకూరు మండల కేంద్రంలో ప్రతి ఆదివారం కొన్నేండ్లుగా సంత కొనసాగుతున్నది. ఈ సంతలో స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు సైతం వ్యాపారం చేసుకుంటారు. సంతలో లభించే ఆకు, కూరగాయలు స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి అమ్ముకుంటారు. పైగా తాజాగా ఉండటంతో పాటు తక్కువ ధరకే లభించడంతో రోజురోజుకూ కొనుగోలుదారుల సంఖ్య పెరుగుతున్నది. ఎన్నో ఏండ్లుగా కొనసాగుతున్న సంత రోడ్డుపైనే కొనసాగుతుండగా ఎటువంటి సౌకర్యాలు లేవు. దీంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండకు ఎండుతూ.. వానకు నానుతూ.. వ్యాపారులు చేసుకునేవారు. గతంలో మార్కెట్లో వసతులు కల్పించాలని పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదు.
2018లో ఎమ్మెల్యేగా గొలుపొంది.. మంత్రి అయినా సబితా ఇంద్రారెడ్డి దృష్టికి సమస్యను స్థానిక ప్రజాప్రతినిధులు జడ్పీటీసీ జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, ఎంపీటీసీ రాజశేఖర్‌రెడ్డి, మన్నే జయేందర్ ముదిరాజ్ సమస్యను మంత్రికి వివరించడంతో స్పందించిన ఆమె మార్కెట్ యార్డు నిర్మాణానికి తక్షణమే రూ.29లక్షలు మంజూరు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో పోలీస్ స్టేషన్ పక్కనే చకచకా మార్కెట్ యార్డు నిర్మించారు. దీంతో వ్యాపారస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ.. తమ కష్టాలు తీరాయని ప్రభుత్వానికి.. మంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.
తీరనున్న వ్యాపారుల కాష్టాలు..
ప్రతి ఆదివారం వ్యాపారస్తులు ఎండకు ఎండుతూ.. వానకు నానుతూ.. వ్యాపారులు చేసుకునేవారు. వసతులు కల్పించాలని గతంలో పలుమార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ సమస్యను మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా నిధులు మంజూరు చేశారు. మార్కెట్ నిర్మాణం పూర్తయింది.
– మన్నే జయేందర్ ముదిరాజ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు
రూ.29లక్షలతో నిర్మాణం
మార్కెట్ యార్డు నిర్మాణం మండల కేంద్రంలో రూ.29లక్షలతో నిర్మించాం. గతంలో వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో మార్కెట్ నిర్మాణం పూర్తయ్యింది ఇక ఇబ్బందులు ఉండవు.
– తాళ్ల కార్తీక్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
మంత్రికి కృతజ్ఞతలు..
రోడ్డుపైనే సంత నిర్వహిస్తుండటంతో పలుమార్లు ప్రమాదాలు జరిగాయి. సంతను రొడ్డుపై నుంచి తొలగించి మార్కెట్ యార్డును నిర్మించాలని వేడుకున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. సమస్యను విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆమె తక్షణమే రూ.29లక్షలు మంజూరు చేసింది. దీంతో మార్కెట్ యార్డును నిర్మించాం. రొడ్డుపై కొనసాగే సంతను త్వరలో మార్కెట్లోకి తరలిస్తాం. సమస్య పరిష్కరించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డికి రుణపడి ఉంటాం.
– సురుసాని రాజశేఖర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కందుకూరు