సిటీబ్యూరో, మే17,(నమస్తే తెలంగాణ): హెచ్ఐవీ భారినపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 16 శాతం కేసులు ఉండటం గమనార్హం. ‘నేడు ప్రపంచ హెచ్ఐవీ వ్యాక్సినేషన్ అవగాహన దినోత్సవం’ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
హైదరాబాద్ జిల్లాలో హెచ్ఐవీ బాధితులు పెరుగుతూనే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హెచ్ఐవీ/ఎయిడ్స్ కేసుల్లో హైదరాబాద్ జిల్లా టాప్ టెన్‌లో ఉంది. గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు 1,27,200 మందికి హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించగా, 2506 మందికి పాజిటివ్ వచ్చి వ్యాధి నిర్ధారణ అయింది. వీరిలో 1550 మంది పురుషులే ఉన్నారు. అదేవిధంగా 43040 మంది గర్భిణులకు టెస్టులు చేయగా 115 మందికి పాజిటివ్ రావడం గమనార్హం.
హైదరాబాద్ జిల్లాలో ఏఆర్టీ సెంటర్ ప్రారంభం నుంచి నేటివరకు 28142 కి సేవలందిస్తుండగా వారిలో 10,357మంది హెచ్ఐవీ/ఎయిడ్స్‌తో మరణించారు. కాగా, గాంధీ జనరల్ ఆసుపత్రి, గాంధీ మెడికల్ కళాశాల, నిలోఫర్ ఆసుపత్రి, కింగ్‌కోటి జిల్లా ఆసుపత్రి, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, గోల్కొండ ఏరియా ఆసుపత్రి, మలక్‌పేట ఏరియా ఆసుపత్రి, నాంపల్లి ఏరియా ఆసుపత్రి, టీబీ అండ్ చెస్ట్ ఆసుపత్రి, పేట్లబుర్జ్ మెటర్నిటి ఆసుపత్రి, శ్రీరాంనగర్ యూపీహెచ్సీ ఆసుపత్రుల్లోని ఐసీటీ కేంద్రాల్లో ఉచితంగా హెచ్ఐవీ పరీక్షలు నిర్వహిస్తారు.
రోగం ముదరకుండానే కేసులను గుర్తించి ప్రత్యేక క్యాంపులు సైతం నిర్వహిస్తూ పరీక్షలు చేస్తున్నాం. ఐసీటీ కేంద్రాల్లో సైతం నిత్యం బాధితులకు పరీక్షలు నిర్వహిస్తూనే. మొదట్లోనే ఈ రోగం భారిన పడకుండా ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
-డాక్టర్ వెంకటి, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి