సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ : దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగే హైదరాబాద్ గణనాథుల నిమజ్జన యాత్రకు వేలాదిగా భక్తులు తరలివచ్చి శోభయాత్రను వీక్షించనున్న నేపథ్యంలో ఆయా ప్రభుత్వ శాఖలు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖైరతాబాద్ భారీ గణనాథుడు ఉదయం 6.30 గంటలకు బయలు దేరి మధ్యాహ్నం 1.30 గంటలోపే పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వినాయక ప్రతిమల నిమజ్జనానికి హుస్సేన్‌సాగర్ చుట్టూ 11 పెద్ద క్రేన్లతో పాటు 40 చిన్న క్రేన్లు ఏర్పాటు చేశారు. గ్రేటర్ అంతటా 134 స్థిర క్రేన్, 259 మొబైల్ క్రేన్లు కృత్రిమ కొలనుల వద్ద ఏర్పాటు చేశారు.
నిమజ్జన ఘట్టంలో ట్రై కమిషనరేట్ పరిధిలో 30 వేల మంది, బల్దియాలో 15వేల మంది సిబ్బంది భాగస్వామ్యం కానున్నారు. శోభాయాత్రను సజావుగా సాగేలా ఆయా శాఖలు కలిపి మొత్తం రూ.30 కోట్లను ఖర్చు చేశారు. శోభాయాత్ర నిర్వహించే మార్గాల్లో 56,187 తాత్కాలిక లైట్లను ఏర్పాటు చేశారు. 303 కిలోమీటర్ల మేరలో రహదారులు మరమ్మతులు జరిపారు. హుస్సేన్‌సాగర్, సరూర్‌నగర్‌తో పాటు 33 చెరువుల వద్ద 200 గజ ఈతగాళ్లు , తొమ్మిది బోట్లతో దాదాపు 400 మంది డీఆర్ఎఫ్ బృందాలు, పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేకంగా 72 బేబీ పాండ్స్‌ను ఏర్పాటు చేసి నిమజ్జనం జరుపుతున్నారు. నగరం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు మొబైల్ టాయిలెట్లు, స్టాటిక్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు.
నిమజ్జనం సందర్భంగా వెలువడిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. 125 జేసీబీలు, 102 మినీ టిప్పర్లను సమకూర్చి ఇప్పటి వరకు 10,500ల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను సేకరించి జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలించారు. కాగా, శుక్రవారం హుస్సేన్‌సాగర్ వద్ద నిమజ్జన ఏర్పాట్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనతో కలిసి మంత్రి పరిశీలించారు.
గ్రేటర్ ఇప్పటి వరకూ గ్రేటర్ పరిధిలో 1.50 లక్షల విగ్రహాలు విజయవంతంగా నిమజ్జనం అయినట్లు మంత్రి చెప్పారు. అలాగే ఖైరతాబాద్, బాలాపూర్ శోభాయాత్రలు సాఫీగా సాగేందుకు ఊరేగింపు మార్గం రోడ్ల మరమ్మతులు ఇప్పటికే పూర్తి చేశామని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మంత్రి వెల్లడించారు.
శుక్రవారం ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లపై ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నిమజ్జనానికి పదివేలకు పైగా టస్కర్ వాహనాలు వచ్చే అవకాశం ఉందని, సుమారుగా పది లక్షల మంది భక్తులు నిమజ్జనంలో పాల్గొంటారని తెలిపారు. గణేశ్ నిమజ్జనానికి 3200 మంది ట్రాఫిక్ సిబ్బంది రెండు షిఫ్టుల్లో బందోబస్తు డ్యూటీ చేస్తారని జోయల్ డేవిస్ తెలిపారు.
6వ తేదీ ఉదయం ఆరుగంటల నుంచి 7వ తేదీ సాయంత్రం పదిగంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, హుస్సేన్‌సాగర్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, విగ్రహాలు లేని వాహనాలకు అనుమతి లేదని ఆయన చెప్పారు. నిమజ్జనం కోసం వాహనాలు కదిలే తీరును రెండు డ్రోన్లు, 14 ప్రాంతాల్లో 40 హైరెజ్డ్ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కంట్రోలింగ్‌కు క్షేత్రస్థాయి సిబ్బందికి తగిన సూచనలు అందిస్తామని ఆయన తెలిపారు.
విగ్రహాలు వచ్చే రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. బాలాపూర్ నుంచి వచ్చే ప్రధాన శోభాయాత్ర చార్మినార్, అబిడ్స్, లిబర్టీ, ట్యాంక్‌బండ్ మీదుగా నెక్లస్రోడ్ వైపు వెళ్తుందన్నారు. సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాలు ప్యాట్నీ, ప్యారడైజ్, రాణిగంజ్, కర్మలామైదాన్ నుంచి ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటాయని, టోలిచౌకి, మెహదీపట్నం నుంచి వచ్చేవి ఖైరతాబాద్ మీదుగా నెక్లస్రోడ్కు చేరుకుంటాయని తెలిపారు. ప్రధాన నిమజ్జన రూట్లలో సాధారణ వాహనాలకు రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సౌత్‌ఈస్ట్‌జోన్ కేశవగిరి, చాంద్రాయణగుట్ట, మూసారాంబాగ్, చంచల్‌గూడ ప్రాంతాలనుంచి వచ్చే వాహనాలకు మళ్లింపులు ఉంటాయని చెప్పారు.
హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జనం సజావుగా జరగడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. గోషామహల్లో మహిళ అశ్వికదళం ప్రారంభానికి వచ్చిన సందర్భంలో నిమజ్జనం ఏర్పాట్లనువివరించారు. నిమజ్జన మార్గాలను పర్యవేక్షించడానికి ప్రస్తు తం ఉన్న సీసీ కెమెరాలకు అదనంగా 250 సీసీ కెమెరాలు, ఆరు డ్రోన్లతో వినియోగిస్తున్నామని, నిమజ్జన ప్రక్రియను మొత్తం కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. నిమజ్జనం సమయంలో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం ఆరుగంటల నుంచి 7వ తేదీ సాయంత్రం ఆరుగంటల వరకు మద్యం, కల్లు విక్రయాలు సిటీలో నిలిపివేసినట్లు పేర్కొన్నారు.
ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనోత్సవానికి ట్యాంక్‌బండ్ వైపునకు తరలొచ్చే భక్తుల కోసం కాచిగూడ, రాంనగర్, కొత్తాపేట, మిథానీ, బోడుప్పల్, మేడిపల్లి, మల్కాజిగిరి తదితర ప్రాం తాల నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. వీటి పర్యవేక్షణకు కోఠి, రేతిఫైల్లో కమ్యునికేషన్ విభాగాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
నవరాత్రులు విశేష పూజలందుకున్న గణపయ్యలు గంగమ్మ ఒడి చేరుతున్నారు. గణపయ్యల నిమజ్జనాలను తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా సాగరతీరానికి చేరుకుంటున్నారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసరాలు భక్తుల కోలాహాలంతో నిండిపోయాయి. నిమజ్జనాలకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఇప్పటికే పటిష్ట చర్యలు చేపట్టారు. దీంతో ఒక్కొక్కటిగా గణపతి ప్రతిమలు నిమజ్జనానికి తరలివస్తున్నాయి. శనివారం ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరుగనుంది. దీంతో భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశముంది. అందుకు తగినట్లుగా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.