సిటీ బ్యూరో/జూబ్లీహిల్స్/బంజారాహిల్స్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఉప ఎన్నిక కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్న నేపథ్యంలో యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలోని మీడియా సెంటర్లో గురువారం కౌంటింగ్ విధానాన్ని మీడియా ప్రతినిధులకు వివరించారు. కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని, మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ చేస్తామన్నారు. నోటాతో కలిపి 59 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున ఈసీఐ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని ఈసారి 42 టేబుళ్లను ఏర్పాటు చేసి గరిష్ఠంగా 10 రౌండ్లలో లెక్కింపు పూర్తిచేస్తామని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియను ఈసీఐ సాధారణ పరిశీలకులు, ఈసీఐ బృందం పరిశీలిస్తుందని అన్నారు.
కౌంటింగ్ ప్రక్రియకు మొత్తం 186 మంది సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. వీరిలో కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, కౌంటింగ్ మైక్రో అబ్జర్వర్లు ఉంటారని అన్నారు. ఎల్ఈడీ స్క్రీన్, ఈసీ యాప్ ద్వారా అప్డేట్ ఇస్తామని చెప్పారు. కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థులు, వారి ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. అనంతరం జాయింట్ సీపీ ఇక్బాల్ మాట్లాడుతూ.. కౌంటింగ్ కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అన్ని విభాగాల పోలీసు బృందాలు అందుబాటులో ఉంటాయని, పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, రిటర్నింగ్ అధికారి సాయిరాం, విజిలెన్స్ అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి తదితరులు ఉన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతున్నామని జనరల్ అబ్జర్వర్ రజత్ కుమార్ సింగ్ తెలిపారు. యూసుఫ్‌గూడ కోట్లవిజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలోని డీఆర్సీ సెంటర్లో చేపడుతున్న కౌంటింగ్ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌తో కలిసి ఆయన పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపులో ఫలితాల సరళి ఎలా ఉంటుందనే ఉత్కంఠ రెండు తెలుగురాష్ర్టాల్లో ఉంది. మొత్తం 407 పోలింగ్ బూత్‌లకు సంబంధించిన ఈవీఎమ్‌లను 42 టేబుళ్లపై లెక్కించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత ఈవీఎమ్లలోని ఓట్లను లెక్కించనున్నారు. మొత్తం 10 రౌండ్లలో లెక్కింపు పూర్తిచేయనున్నామని అధికారులు ప్రకటించడంతో రౌండ్లవారీగా ఆధిక్యాలు ఎవరికి వస్తాయనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ షేక్‌పేట డివిజన్ పరిధిలోని 1నుంచి 42 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎమ్‌ల లెక్కింపుతో ప్రారంభం కానుంది. ఆఖరి రౌండ్లో ఎర్రగడ్డ డివిజన్లోని 407వ బూత్‌తో ముగియనుంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద ప్రత్యేక భద్రతా దళాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. ఉదయం 7 గంటలకు అభ్యర్థుల సమక్షంలో వాటిని స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటిగ్ హాల్‌కు తరలించనున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది.