సీటీబ్యూరో, జూలై 19 (నమస్తే తెలంగాణ): నులిపురుగుల నివారణకు ఈనెల 20వ తేదీన గ్రేటర్ వ్యాప్తంగా నులిపురుగుల నివారణ రోజు (డీవార్మింగ్ డే) నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె.వెంకటి తెలిపారు. హైదరాబాద్ పరిధిలో మొత్తం 10లక్షల 70వేల మందిని గుర్తించామని, వారికి అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. 1 నుంచి 19 ఏండ్ల మధ్య వారికి ఈ మాత్రలను పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, మదర్సాలు, జూనియర్ కళాశాలల్లో ఈ మాత్రలను పంపిణీ చేయనున్నట్లు వివరించారు. నులిపురుగులతో పిల్లల్లో రక్తహీనత సమస్య ఏర్పడుతుందని, ఫలితంగా పిల్లల ఎదుగుదల దెబ్బతినడంతోపాటు చదువులో నెమ్మదిస్తారన్నారు. దీనిని నివారించేందుకే అల్బెండజోల్ మాత్రలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. అనివార్య కారణాలతో నేడు మాత్రలు వేసుకోని పిల్లలకు ఈనెల 27న నిర్వహించే మాపప్ రౌండ్లో ఈ మాత్రలను పంపిణీ చేయనున్నట్లు డా.వెంకటి వెల్లడించారు.