అబిడ్స్, జూన్ 7 : చేప ప్రసాదం పంపిణీకి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఉబ్బస వ్యాధి గ్రస్తులకు బత్తిని కుటుంబీకులు ఇచ్చే చేప ప్రసాదాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఆది, సోమవారాల్లో పంపిణీ చేయనున్నారు. ఆర్అండ్బీ అధికారులు క్యూలైన్ల కోసం బారికేడ్లను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు పారిశుధ్యంతో పాటు మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు, వాటర్‌వర్క్స్ అధికారులు మంచినీటి సరఫరాకు కౌంటర్లు ఏర్పాటు చేశారు.
రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వివిధ స్వచ్ఛంద సంస్థలు చేప ప్రసాదం స్వీకరించేందుకు వచ్చే ఆస్తమా వ్యాధిగ్రస్తులు వారి సహాయకులకు అల్పాహారాలు ఉచితంగా అందించేందుకు కౌంటర్లను ఏర్పాటు చేశాయి. అగర్వాల్ సమాజ్, జైస్వాల్ సమాజ్‌లతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల వారు ప్రత్యేకంగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం కోసం వచ్చే ఉబ్బస వ్యాధిగ్రస్తులు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానానికి చేరుకునేందుకు గాను నగరంలోని వివిధ రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్ల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఎగ్జిబిషన్ మైదానానికి ఏర్పాటు చేశారు.
ఈ సంవత్సరం 42 క్యూలైన్లను ఏర్పాటు చేసి చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు గాను అధికార యంత్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఫిషరీస్ డిపార్ట్ మెంట్ ద్వారా లక్షకు పైగా చేప పిల్లలను అందుబాటులో ఉంచి అవసరాలను బట్టి మైదానానికి తరలించేందుకుగాను ఆ శాఖ వారు ఏర్పాట్లు చేపట్టారు. చేప ప్రసాదం కోసం సమయనుసారం ప్రత్యేక టోకెన్లు ఇవ్వనున్నట్లు, మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తెలిపారు.
చేప ప్రసాదం పంపిణీకి మత్స్య శాఖ ద్వారా లక్షన్నర చేప పిల్లలను సిద్ధంగా ఉంచుతున్నట్లు రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తెలిపారు. బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, జమ్మూ కశ్మీర్ తో పాటు ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వ్యాధి గ్రస్తులకు ప్రత్యేక సదుపాయం ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనల మేరకు చేప ప్రసాదాన్ని ప్రత్యేక ప్రణాళికతో గతంలో కంటే ఎక్కువ క్యూ లైన్లు ఏర్పాటు చేసి వివిధ సంస్థల ద్వారా పంపిణీ జరిగేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మృగశిర కార్తె ప్రవేశిస్తుండటంతో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ చేప ప్రసాదం పంపిణీ ప్రారంభిస్తారని, టీ పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ హాజరు కానున్నట్టు తెలిపారు.