రవీంద్రభారతి, ఆగస్టు 5: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను గౌరవించాలని, కుమారులు ఎంత ఎత్తు ఎదిగినా తల్లిదండ్రుల వద్ద ఒదిగే ఉండి, తల్లిదండ్రులను ఆదుకోవాల్సిన అవసరం నేటి యువతరంపై ఉన్నదని తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారుడు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. పిల్లల కోసం సర్వస్వాన్ని వెచ్చించి విద్యాబుద్ధులు చెప్పించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దిన ఘనత తల్లిదండ్రులదేనన్నారు.
శ్రీమాన్ కేవీ రాఘవాచార్యులు కడు పేదరికం నుంచి మమ్ముల్ని ఈ స్థాయికి తీసుకువచ్చారని రమణాచారి అన్నారు. కేవీ రాఘవాచార్యుల స్మారక పండిత పురస్కారాన్ని శ్రీమాన్ డా.శ్రీ పెరుంబుదూరు శ్రీరంగాచార్యులకు, డా. కేవీ రమాణాచార్య స్ఫూర్తి పురస్కారాన్ని శ్రీభాష్యం శ్రావణ కుమార్కు బహూకరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తిరుమల ఛారిటిబుల్ ట్రస్ట్, సాధన సాహితీ స్రవంతి హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో సోమవారం రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో రాఘవాచార్యుల స్మారక పండిత పురస్కారాన్ని ప్రదానం చేశారు. పాలెం ప్రాచ్య కళాశాల పూర్వ ప్రధానాచార్యులు శ్రీమాన్ డా.శ్రీ పేరుంబుదూరు శ్రీరంగాచార్యులుకు రాఘవాచార్యుల పురస్కారాన్ని బహూకరించారు. డాక్టర్ కేవీ రమణాచారి స్ఫూర్తి పురస్కారం భాష్యం శ్రావణ కుమార్కు బహూకరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగద్గురువులు పుష్పగిరి పీఠాధిపతి అభినవోద్ధండ విద్యాశంకర భారతి విచ్చేసి జ్యోతి ప్రజ్వలనం చేసి పురస్కారాలను బహూకరించారు. విద్యాశంకర భారతి మాట్లాడుతూ శ్రీమాన్ కేవీ రాఘవాచార్యులు గొప్ప సాహితీవేత్త అని కొనియాడారు. కేవీ రాఘవచార్యులు అనేక పుస్తకాలు రాసిన గొప్ప మహనీయుడని పేర్కొన్నారు. కార్యక్రమంలో కవి కసిరెడ్డి వెంకట్రెడ్డి, డాక్టర్ మామిడి హరికృష్ణ, సాధన నరసింహాచార్య, కవి రఘుశ్రీ పాల్గొన్నారు.