TJF | ఖైరతాబాద్, మే 28 : తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీజేఎఫ్ 25వ వసంతాల వేడుకకు హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్ వేడుక కానుంది. ఈ నెల 31న జరిగే తెలంగాణ జర్నలిస్టు ఫోరం రజతోత్సవ పోస్టర్లను సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్, ఫోరం అధ్యక్షులు అల్లం నారాయణ, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతిసాగర్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఎ. రమణ కుమార్, ఐజేయూ నేత అవ్వారి భాస్కర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కోశాధికారి పి. యోగానంద్, సహాయ కార్యదర్శి యార నవీన్ కుమార్, హైదరాబాద్ నగర అధ్యక్ష, కార్యదర్శులు రాకేశ్ రెడ్డి, సోమేశ్, కోశాధికారి వి. బాపురావుతో కలిసి ఆవిష్కరించారు.
తెలంగాణ మలి దశ ఉద్యమంలో మొదలైన టీజేఎఫ్ ప్రస్థానం, ప్రత్యేక రాష్ట్రావిర్భావం తర్వాత కూడా టీయుడబ్ల్యూజేగా జర్నలిస్టుల సమస్యలపై వారి పక్షాన నిలబడిందని అల్లం నారాయణ అన్నారు. 14 సంవత్సరాల ఉద్యమ కాలంలో సాగరహారం మొదలు మిలియన్ మార్చ్ వరకు, ఆపై తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో టీజేఎఫ్ పోషించిన పాత్ర చారిత్రాత్మకమని కొనియాడారు. ఈ నెల 31న జరిగే రజతోత్సవ వేడుకల్లో నాడు టీజేఎఫ్తో కలిసి నడిచిన అన్ని పార్టీల నాయకులు, పార్టీలు, ఉద్యోగ, ప్రజా సంఘాలు, మేథావులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ వేడుకలు ఏడాది పాటు కొనసాగుతాయని, 2026 మే 31న ముగింపు సందర్భంగా జర్నలిస్టులు, టీజేఎఫ్ ఉద్యమ ప్రస్థానంపై పుస్తకాల ఆవిష్కరణ ఉంటుందని పేర్కొన్నారు.