సిటీబ్యూరో, మార్చి 17 (నమస్తే తెలంగాణ): ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ నెల 23వ తేదీ నుంచి మే 21 వరకు జరిగే 18వ ఎడిషన్ టాటా ఐపీఎల్ 2025 క్రికెట్ పోటీల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై సోమవారం రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు నేరేడ్మెట్లోని కమిషనరేట్ కార్యాలయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు, ఉప్పల్ స్టేడియం అధికారులు, సన్ రైజర్స్ టీమ్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ సుధీర్‌బాబు మాట్లాడుతూ క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా అన్ని రకాలైన సెక్యూరిటీ పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భద్రతాపరమైన ఉల్లంఘనలు, అవాంఛనీయ సంఘటనలకు అవకాశం ఇచ్చే ఎలక్ట్రానిక్ పరికరాలు, అగ్గిపెట్టెలు, ల్యాప్‌టాప్‌లు, పదునైన వస్తువులతో పాటు బయట నుంచి తెచ్చే తినుబండరాలు, వాటర్ బాటిల్స్ వంటి వాటిని స్టేడియంలోకి అనుమతించకూడదని అధికారులను ఆదేశించారు.
భారీ సంఖ్యలో క్రికెట్ అభిమానులు హాజరయ్యే అవకాశం ఉండటంతో కార్లు, ద్విచక్రవాహనాలకు సంబంధించిన పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని, సాధారణ వాహనదారుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఉప్పల్ రహదారిపై ట్రాఫిక్ రద్దీ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. స్టేడియం చుట్టూ 450 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సివిల్, ట్రాఫిక్, రిజర్వు, పోలీస్, ఎస్ఓటీ విభాగాల అధికారులు, సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు. టికెట్ల పంపిణీలో గందరగోళం లేకుండా చూడాలని ఐపీఎల్ బృందానికి సూచించారు. మల్కాజిగిరి డీసీపీలు పద్మజ, అరవింద్‌బాబు, ఇందిర, నర్సింహారెడ్డి, మల్లారెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.