Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్లోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజీలో రూ. 1.07 కోట్ల నగదు చోరీకి గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నెల రోజుల తర్వాత ముగ్గురు దొంగలు పట్టుబడ్డారు. ఈ ముగ్గురిలో ఒకరు మైనర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మంగళవారం ఉదయం కొత్తగూడ ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద కదలికలతో తిరుగుతున్న రాజ్ మనోహర్ పవార్(22), రితిక్ మోహితే(24), 16 ఏండ్ల బాలుడు ఉన్నారు. మరో ముగ్గురు దినేశ్ మెహితే, అరుణ్ మోహితే అలియాస్ కలూ, విలాస్ చోహన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రాజ్ మనోహర్ది గుజరాత్, రితిక్ది మధ్యప్రదేశ్ అని పోలీసులు తేల్చారు. రితిక్ న్యాయ విద్య అభ్యసిస్తున్నట్లు తేలింది.
ఈ దోపిడీ గ్యాంగ్ నగర శివార్లలోని కాలేజీలపై కన్నేసింది. ఈ క్రమంలో అక్టోబర్ 10వ తేదీన గూగుల్ మ్యాప్ ద్వారా బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజీని గుర్తించి, అక్కడికి వెళ్లారు. అర్ధరాత్రి వరకు అక్కడున్న చెట్ల పొదల్లో మకాం వేశారు. అనంతరం కాలేజీలోకి చొరబడి.. అల్మారాను పగులగొట్టారు. అందులో ఉన్న రూ. 1.07 కోట్ల నగదును అపహరించారు. అనంతరం దొంగలందరూ రూ. 17.8 లక్షల చొప్పున పంచుకున్నారు. రాచకొండ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగల ఆచూకీ కోసం గాలించారు. మొత్తానికి ఇవాళ కొత్తగూడ ఎక్స్ రోడ్డులో దొంగలు పట్టుబడ్డారు. వారి నుంచి రూ. 37.05 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.