Hyderabad | హైదరాబాద్ : ఓ వైద్యురాలిని నిలువునా మోసం చేశారు. తమ వద్ద మహిమ గల చెంబు ఉందంటూ.. వైద్యురాలి నుంచి రూ. 150 కోట్లు కాజేశారు కేటుగాళ్లు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు.. హైదరాబాద్కు చెందిన ప్రియాంక అనే వైద్యురాలిని సంప్రదించారు. తమ వద్ద రూ. 30 కోట్లు విలువ చేసే మహిమ గల చెంబు ఉందని, దాంట్లో డబ్బులు వేస్తే రెట్టింపు అవుతాయని నమ్మబలికారు. ఆమె కూడా వారి మాటలను నమ్మింది. దీంతో ఆ ముగ్గురు వ్యక్తులకు వైద్యురాలు రూ. 1.50 కోట్లు ఇచ్చింది. డబ్బు రెట్టింపుపై ప్రశ్నిస్తే వారి నుంచి సమాధానం లేదు. ఆరు నెలల గడుస్తున్నా వారి నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో, మోసపోయానని గ్రహించిన వైద్యురాలు ప్రియాంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.2,42,400 నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విశాఖపట్నం అరకులోయకు చెందిన పెందుర్తి శ్రీనివాస్, వనుము శ్రీనివాస్, కొర్రా బంగార్రాజుగా పోలీసులు గుర్తించారు.