Metro Rail | సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): మెట్రో ప్రయాణికులకు ఎల్ అండ్ టీ మెట్రో రైలు సంస్థ శుభవార్త చెప్పింది. ఈ ఆఫర్లు వచ్చే ఏడాది మార్చి 31 వరకు అందుబాటులో ఉంటాయని ఎల్ అండ్ టీ మెట్రో రైల్ సీఈఓ, ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. సూపర్ సేవర్ ఆఫర్లో భాగంగా రూ.59 తో నిర్ణయించిన సెలవు రోజుల్లో అపరిమిత ప్రయాణాన్ని చేయవచ్చన్నారు.
అలాగే స్టూడెంట్ పాస్ ఆఫర్లో భాగంగా విద్యార్థులు 20 ట్రిప్పులకు డబ్బులు చెల్లించి 30 ట్రిప్పులు ప్రయాణం చేసే ప్రత్యేక ఆఫర్ తీసుకొచ్చామని పేర్కొన్నారు. వీటితో పాటు సూపర్ సేవర్ ఆఫ్ ఫీక్ అవర్ ఆఫర్ కింద రద్దీ లేని సమయాల్లో ప్రయాణిస్తున్నప్పుడు కాంటాక్ట్‌లెస్ స్మార్ట్ కార్డులపై 10 శాతం రాయితీని పొందవచ్చని చెప్పారు. ఈ మూడు ఆఫర్లు మార్చి 31, 2025 వరకు పొడిగించామని తెలిపారు.
6 నుంచి పార్కింగ్ రుసుము..
నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లో ఉన్న పార్కింగ్ లాట్లలో ఈ నెల 6 నుంచి నామమాత్రపు పార్కింగ్ రుసుమును వసూలు చేస్తామని ఎల్ అండ్ టీ మెట్రో రైల్ సీఈఓ, ఎండీ కేవీబీ రెడ్డి ప్రకటించారు. ఈ పార్కింగ్ స్థలాలను ప్రయాణికులకు సౌలభ్యంగా తీర్చిదిద్దామని తెలిపారు.