కొండాపూర్/మాదాపూర్ ఆగస్టు 4 : నగరంలో ఆదివారం వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. అతివేగం..నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటనలు చోటుచేసుకున్నాయి. గచ్చిబౌలి పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామానికి చెందిన బాల ప్రసన్న (24) బీటెక్ పూర్తి చేసి.. ఉద్యోగం కోసం నగరానికి వచ్చాడు. అదే మండలం మర్రిచెట్టుపాలెం గ్రామానికి చెందిన అతడి స్నేహితుడు రోహిత్ (26) ఐటీ కారిడార్‌లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు.
ఆదివారం తెల్లవారు జామున వీరిద్దరూ కలిసి బైక్‌పై మజీద్‌బండ వైపు నుంచి హఫీజ్‌పేట్ వైపు వెళ్తున్నారు. బైక్ నడుపుతున్న రోహిత్ మితిమీరిన వేగంతో బొటానికల్ గార్డెన్ సమీపంలోని కొండాపూర్ ఫ్లైఓవర్‌పైకి వెళ్లాడు. వంతెన మలుపులో అదుపుతప్పి రెయిలింగ్‌ను బలంగా ఢీకొట్టాడు. ప్రసన్న, రోహిత్ ఇద్దరు ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడిపోయారు. తీవ్రంగా గాయపడిన వీరిద్దరిని దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయారు. గచ్చిబౌలి పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు.
లారీ కిందపడి..
లారీ కిందపడి ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. మాదాపూర్ ఇన్స్పెక్టర్ కృష్ణ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని అమలాపురానికి చెందిన ప్రవీణ్ (25), అరిగాలి జై స్వామి శంకర్ (24) సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ ఐసీఐసీఐ బ్యాంక్ ఇన్సురెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ.. కేపీహెచ్‌బీ రోడ్డు నంబర్ 6 లో నివాసముంటున్నారు. ఆదివారం తెల్లవారు జామున స్నేహితులను కలిసేందుకు ద్విచక్రవాహనంపై వీరిద్దరూ నిర్లక్ష్యంగా.. వేగంగా జేఎన్టీయూ నుంచి మాదాపూర్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో బండి అదుపుతప్పడంతో ప్రవీణ్ సడెన్ బ్రేక్ వేయగా, వెనకాల కూర్చున్న జై స్వామి శంకర్ ఎగిరి అటుగా వెళ్తున్న లారీ కింద పడి మృతిచెందాడు. ప్రవీణ్ గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.